పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువు మాత్రమే నని నమ్మి.. నాడు-నేడు స్కూళ్ల రూపురేఖలు జగనన్న మార్చారని తెలిపింది. సీఎం జగన్ నమ్మిన విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్నారని..
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నార్పలలో ‘జగనన్న వసతి దీవెన పథకం’ నిధులు విడుదల చేశారు. వసతి దీవెనలో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్ మెడిసిన విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, చొప్పున సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేయకూడదని.. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నాడు-నేడుతో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మార్చేస్తామని సీఎం జగన్ తెలిపారు. చదువుతో పేదరికాన్ని దూరం చేయగలమని, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ప్రభుత్వం సాయం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న దివ్య దీపిక అనే విద్యార్థిని భావోద్వేగంగా మాట్లాడింది. తన తండ్రి పేరు బాలకృష్ణ అని.. టైలర్ గా పనిచేస్తున్నాడని.. తల్లి సాధారణ గృహిణి అని, వారు ధర్మవరం గ్రామానికి చెందిన వారని తెలిపింది. ఆర్థికంగా వారి కుటుంబం చాలా వెనకబడిన కుటుంబం అని, ప్రభుత్వం అందిస్తున్న ‘జగనన్న వసతి దీవెన పథకం’తో తమ కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే చదివిస్తోందని తెలిపింది.
పైసా ఖర్చు లేకుండా హాస్టల్ ఫీజు, చదువుకోవడానికి అవసరమయ్యే అన్ని సదుపాయాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని హర్షం వ్యక్తం చేసింది. పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి చదువు మాత్రమేనని నమ్మి.. నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు జగనన్న మార్చారని తెలిపింది. సీఎం జగన్ నమ్మిన విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్నారని, చదువుల దీపాలను వెలిగించే యాగానికి జగనన్న శ్రీకారం చుట్టారని దివ్య దీపిక కొనియాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ‘జగనన్న వసతి దీవెన పథకం’ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,62 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. సీఎం జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ప్రజల వద్దకు తీసుకువస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.