అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ అదుపుతప్పి బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని భీమడోలు మండల పరిధిలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగి ఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి తప్పి వేగంగా దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షుల వాదన మరోలా ఉంది. డ్రైవర్ అతి వేగంతో బస్సు నడవడం.. అదుపు చేయలేకపోవడంతో యాక్సిడెంట్ అయిందని చెబుతున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.