హైదరాబాద్ లోన అంబర్ పేట్ కుక్కల దాడి తరహాలోనే మంగళవారం ఏపీలో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేశాయి. ఈ దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల కాలంలో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. వీటిలో దాడిలో కొందరు, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో గాయాలపాలవుతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని అంబర్ పేట్ ప్రాంతంలో ప్రదీప్ అనే నాలుగేళ్ల బాలుడిని చుట్టు ముట్టి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆ బాలుడికి తీవ్ర గాయాలై.. అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అందరిని కంటతడి పెట్టించింది. అభంశుభం తెలియని ఆ పసివాడిని కుక్కలు చుట్టుముట్టి దాడి చేసి చంపేశాయి. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా అదే తరహాలో ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఓ బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని నలందా ప్రాంతంలో ధనుష్ అనే ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వీటి దాడిలో ఆ బాలుడు తీవ్రంగా గాయపడగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం బాలుడి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో తిరుపతికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న రాజంపేట పురపాలక సంఘం అధికారులు ఆసుపత్రిలో బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అలానే కుక్కల దాడి ఘటనపై స్పందించి.. వెంటనే నలందా ప్రాంతంలోని కుక్కలన గుంపును మున్సిపల్ సిబ్బంది సాయంతో పట్టించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి పలు విషయాలు తెలిపారు.
పట్టణంలో కుక్కలను పూర్తి స్థాయిలో పట్టుకునేందుకు తక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. బాలుడి ఘటన నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని , వీధుల్లో తిరగాలంటేనే భయంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది రాజంపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడిలో ఏడుగురు గాయపడ్డారని, ముఖ్యంగా బైపాస్ రోడ్డులో రాత్రిళ్లు కుక్కలు గుంపులుగా సంచరిస్తూ వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరి.. ఇలా వరుసగా జరుగుతున్న కుక్కల దాడుల ఘటనలపై, నివారణ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.