ఏపీలో సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న టికెట్స్ రేట్ల పోరు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడంతో సమస్య పక్కదారి పట్టినట్టే కనిపించింది. కానీ.., ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకుని మెగాస్టార్ చిరంజీవిని మీటింగ్ కి ఆహ్వానించడం.., చిరు మర్యాద పూర్వకంగా వెళ్లి సీఎం జగన్ కి కలవడం చకచక జరిగిపోయాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ మీటింగ్ తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే మీటింగ్ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ముచ్చటించారు.
“ఇండస్ట్రీకి పరిశ్రమకి మధ్య గ్యాప్ పెరగకూడదు అన్న సహృదయంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను సమావేశానికి ఆహ్వానించారు. ఆ మేరకు సీఎంని కలవడం జరిగింది. సినీ పరిశ్రమ అంటే బయటకి కనిపించే అంత హంగులు ఉండవు. ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడని పేదలు ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను. పేదవారిపై టికెట్స్ భారం పడకూడదు అన్న ప్రభుత్వ నిర్ణయం సరైనదే. కానీ.., ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బ తినకూడదు. ఈ విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. సీఎం జగన్ అన్నీ విషయాల మీద చాలా పాజిటివ్ గా స్పందించారు. తాను ఏ ఒక్కరి తరువున ఉండనని.., అందరికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మరో.. వారం, పది రోజుల్లో అందరికి ఆమోదకరమైన జీవో రావచ్చు. ఈ విషయంలో అన్నీ వివరాలతో మరోసారి సీఎంని కలుస్తాను. నన్ను సొంత మనిషిలా చూస్తున్న జగన్ గారికి కృతజ్ఞతలు” అంటూ.. మెగాస్టార్ తెలియజేశారు. ఏదేమైనా ఇన్ని రోజులు అనవసర రచ్చతో పక్కదారి పట్టిన టికెట్స్ రేట్ల వ్యవహారం.. ఓ మంచి మలుపు తీసుకోవడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.