Buggana Rajendranath Reddy: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశం మొదలైన నిమిషాల్లోనే టీడీపీ సభను అడ్డుకోవటానికి ప్రయత్నించింది. టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి సభలో గందరగోళం సృష్టించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలు పెడదామని స్పీకర్ ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. ఈ నేపథ్యంలో బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తూ వచ్చారు. మధ్యాహ్నం టీడీపీ సభ్యులొకరు అడిగిన ప్రశ్నకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం ఇస్తూ..
‘‘ గౌరవ సభ్యులు చెప్పే ప్రతి అంశం చరిత్రకు, వాస్తవాలకు వ్యతిరేకంగా ఉంది. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును అసెంబ్లీలో టేబుల్ కూడా చేయలేదు. వ్యాపార కమిటీతో రాజధానిని ఎన్నిక చేశారు. అమరావతిని రాజధాని చేస్తున్నట్లు ముందుగానే తెలుసుకాబట్టి.. అక్కడ టీడీపీ వాళ్లందరూ భూములు కొన్నారు. చంద్రబాబుతో సహా పెద్ద పెద్ద వాళ్లు కూడా భూములు కొన్నారు. అందుకే దాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ముఖ్యమంత్రిగారు చెప్పారు. 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు వెయ్యిమంది చేతుల్లోనే ఉన్నాయి. రాజధానిలో ఏ బిల్డింగుకు కూడా సరిగ్గా కిటికీలు కూడా లేవు. కిటికీలు లేని బిల్డింగులు కట్టారు. ఇదంతా టెంపరరీ అని వాళ్లే చెప్పారు. అందుకే అప్పుడే చెప్పాము. టీడీపీ అంటే ‘టెంపరరీ డెవలప్‌మెంట్ పార్టీ’ అని పెట్టాం.
వేల ఎకరాలు కొంతమంది చేతుల్లో ఉన్నాయి. ఆ వేల ఎకరాలను అభివృద్ధి చేయటానికి రాష్ట్రమంతా కలిసి పెట్టుబడి పెట్టాలి. రాష్ట్రం అప్పులు చేయాలి. ఆ అప్పుల్ని రాష్ట్రమంతా కలిసి కట్టుకోవాలి. కానీ, ఉపయోగపడేది మాత్రం కొంతమందికి. ఇది ఎంత అన్యాయం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంతా అభివృద్ది చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని అన్నారు. మరి, 30 వేల ఎకరాల్లో 10 వేల ఎకరాలు వెయ్యిమంది చేతుల్లోనే ఉన్నాయని టీడీపీని ఉద్ధేశించి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : YS Jagan: అచ్చెన్నాయుడికి ఆఫర్ ఇస్తూనే పంచ్ చేసిన సీఎం జగన్..!