గత కొన్ని రోజులుగా ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పీఆర్సీ జీఓలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే జీఓలో పేర్కొన్న విధంగా రికవరీ లేకుండా జీతాలు వేయాలని.. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రికవరీ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణలో భాగంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.
కాగా, పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనెఫిట్స్ ను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య ఈ పిటిషన్ వేశారు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెక్షన్ 78(1)కి విరుద్ధంగా ఉన్న జీవో1ని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు.