ఆంధప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక సిలీండర్ పేలిన ఘటనలో దాదాపు తొమ్మిది లక్షల నష్టం వాటిల్లింది. గంగిరెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు భార్య సుశీల ఇంట్లో పాలు కాస్తున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఒక్కసారే మంటలు చెలరేగడంతో ఆమె భయంతో కేకలు వేస్తూ పరుగులు పెట్టింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపిడి పైన ఉన్న కప్పుపై పడి రేకులు మొత్తం కాలిపోయాయి.
మంటలు చుట్టుముట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు బయటికి పరుగులు తీశారు. ఇంట్లో దాచి ఉంచిన మూడు లక్షల రూపాయల నగదు కాలి బూడిద అయ్యాయి. నాలుగు లక్షల విలువైన బంగారం అగ్నికి ఆహుతి అయింది. ఇక ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి మంటలార్పే పనిలో ఉన్నారు. తాము ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, బంగారం కాలి బూడిద కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.