ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ దుర్గమ్మ వారికి సమర్పించిన చీర ఏదైతే ఉందో ఆ చీర ఇంటి దొంగలను పట్టుకుంది. ఇంటి దొంగలు ఎవరు? చీర ఎలా పట్టించింది? ఆ కథేంటో మీరే చదివేయండి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం విజయవాడ దురమ్మ తల్లికి పట్టు చీర సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చీరను దేవస్థానం సిబ్బంది చీరల విక్రయ కౌంటర్ కి పంపించారు. అయితే కాంట్రాక్టర్ ఆ చీరను జనసేన అభిమాని అయిన ఒక మహిళకు విక్రయించేందుకు ప్రయత్నించారు. చీరను విక్రయిస్తున్న సమయంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కు సమాచారం చేరింది. దీంతో ఆయన దుర్గ గుడి అధికారులకు ఫోన్ చేసి ఆ చీరను కొంటానని చెప్పారు. ఈఓ అధికారి కౌంటర్ కి ఫోన్ చేసి ఆ చీరను ఆ మహిళకు విక్రయించకుండా తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. కౌంటర్ సిబ్బంది ఆ చీరను ఈవో అధికారికి అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న చీరల కాంట్రాక్టర్.. విక్రయాల కౌంటర్ నుంచి చీరను తీసుకెళ్లిన దేవస్థాన సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషించారు.
సిబ్బంది ఈవోకి ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఈ విషయం దేవాదాయశాఖకు, సీఎంఓ వరకూ వెళ్లడంతో ఉద్యోగి నేరుగా మంత్రికి, సీఎంఓకు ఫిర్యాదు చేశారు. గతంలో చీరల కౌంటర్ ను దేవస్థానం సిబ్బంది నిర్వహించేవారని, ఆ సమయంలో 17 నెలలకు 12 కోట్ల ఆదాయం దేవస్థానానికి సమకూరేదని.. అయితే ఏడాదికి 3.30 కోట్లకే చీరల కౌంటర్ కాంట్రాక్ట్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఈవో, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని ఆరోపణలు రావడంతో కాంట్రాక్టర్ అసలు ముసుగు బయటపడింది. గతంలో చీరల కౌంటర్ లో పనిచేసిన తాను 17 నెలల్లో 12 కోట్ల పైనే ఆదాయం సమకూర్చానని అన్నారు. 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 ఆగస్టు 31 వరకూ చీరల విక్రయాల ద్వారా 6.65 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని.. ఆ మొత్తాన్ని దేవస్థానానికి జమ చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు.
2019, 2020 లలో కోవిడ్ కారణంగా చీరల విక్రయాలు తక్కువగా ఉండడంతో ఆ కాంట్రాక్ట్ ను కరోనా సాకు చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చీరల కౌంటర్ ద్వారా రెండేళ్లకు సుమారు రూ. 16 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉండగా.. ఏడాదికి కేవలం రూ. 3.3 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిపారు. ఈ వ్యవహారం సీఎంఓ వరకూ వెళ్లడంతో పవన్ కళ్యాణ్ చీర వివాదాన్ని సాకుగా చూపించి దుర్గ గుడి అధికారులు కాంట్రాక్టును రద్దు చేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి త్వరలోనే చీరల కౌంటర్ కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే టెండర్ వ్యవహారంలో తమ తప్పు లేదని ప్రూవ్ చేసుకోవడానికి కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై సీఎంఓ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి విజయవాడ దుర్గమ్మ వారికి పవన్ కళ్యాణ్ సమర్పించిన పట్టు చీర ఇంటి దొంగలనే పట్టించింది. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.