మెగా ఆక్షన్‌ లో ముంబయి ఆ ముగ్గిరినే రిటైన్‌ చేసుకోవాలంటున్న సెహ్వాగ్‌

sehwag

ముంబయి ఇండియన్స్‌ ఈ సీజన్‌ ఆశించిన ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. కేవలం లీగ్‌ మ్యాచ్‌లతోనే సరిపెట్టుకుంది. ఆడిన 14 మ్యాచ్‌లలో 7 విజయాలు, 7 పరాయజయాలతో 14 పాయింట్లు సాధించింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కూడా అన్నే విజయాలే సాధించినా.. మంచి నెట్‌ రన్‌ రేట్‌ వల్ల కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది. వీరేంద్ర సెహ్వాగ్‌ కోరుకున్నదే జరిగింది. ముంబయి ప్లే ఆఫ్స్‌ కూడా చేరకూడదు.. ఈసారి కొత్త ఛాంపియన్‌ని చూడాలి అని కోరుకున్నట్లుగానే జరిగింది. ఇప్పుడు ముంబయికి ఒక సలహా ఇస్తున్నాడు మన డాషింగ్‌ ఓపెనర్‌.

ముంబయికి వాళ్లే బలం

ముంబయి ఇండియన్స్‌ నిలకడగా ప్రదర్శన చేయడం వెనుక రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, పొలార్డ్‌ వంటి వాళ్లు కొన్నాళ్లుగా ముంబయిలో కొనసాగడం టీమ్‌కు బలంగానే చెప్పాలి. వచ్చే సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు వస్తున్న దృష్ట్యా కచ్చితంగా టీమ్‌లో ప్లేయర్లను కోల్పోయో పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ముంబయి ఇండియన్స్‌ టీమ్‌ చెల్లాచెదురు అవుతుంది. వచ్చే సీజన్‌కు సంబంధించి రిటైన్‌ నియమాలను ఇంకా బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు. రిటైన్‌ పాలసీ గురించి సరైన అవగాహన లేదు. ముగ్గురు వరకు ప్లేయర్లను రిటైన్‌ చేసుకునే అవకాశం ఉంది అని వినిపిస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన లేదు.

వాళ్లనే రిటైన్‌ చేసుకోవాలి

ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ముంబయి ఇండియన్స్‌ ఎవరిని రిటైన్‌ చేసుకుంటే బాగుంటుంది అనే అంశంపై సెహ్వాగ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ముగ్గురిని రిటైన్‌ పరిస్థితి ఉంటే.. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, జాస్ప్రిత్‌ బుమ్రాలను రిటైన్‌ చేసుకోవాల్సిందిగా సూచించాడు. ‘హార్దిక్‌ పాండ్యా తన ఫిట్‌నెస్‌ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి. అతను బౌలింగ్‌ చేయకుంటే అతడిని తీసుకుని ఉపయోగం ఉండదు. భవిష్యత్‌ అవసరాల రీత్యా ఇషాన్‌ కిషన్‌ని రిటైన్‌ చేసుకోవాలి’ అంటూ సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. హార్దిక్‌కు అయిన గాయం కారణంగా వచ్చే వేలంలో పాండ్యాకు మంచి ధర పలికే అవకాశం కూడా లేదని అభిప్రాయ పడ్డాడు. వచ్చే డిసెంబర్‌లో ఐపీఎల్‌ సీజన్‌ 15కు సంబధించిన మెగా వేలం జరిగే అవకాశం ఉంది.