భారత క్రికెట్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వెటరన్ ప్లేయర్ అజిత్ అగార్కర్ పేరు దాదాపుగా ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే అతడి ఎంపిక విషయంలో బీసీసీఐ ముందు కొన్ని అడ్డంకులు ఉన్నాయి.
భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీలో కొత్త మార్పులు రావడం దాదాపుగా ఖాయమైంది. టీమిండియా నూతన చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు ఫిక్స్ అయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే వీటిని వీరూ ఖండించిన విషయం తెలిసిందే. సెలెక్టర్ పదవికి సంబంధించి భారత క్రికెట్ బోర్డు తనను సంప్రదించలేదని సెహ్వాగ్ స్పష్టం చేశాడు. దీంతో ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ రేసులో మరో మాజీ ఆటగాడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్. పరిస్థితులు చూస్తుంటే భారత క్రికెట్ జట్టుకు సరికొత్త చీఫ్ సెలెక్టర్ ఖరారైనట్లేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అగార్కర్‌ను సెలెక్షన్ కమిటీకి కొత్త చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ ఫిక్స్ అయిందని సమాచారం. సెలెక్షన్ కమిటీ రేసులో గత రెండు సార్లు కూడా అగార్కర్ పేరు వినిపించింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు చీఫ్ సెలెక్టర్ రేసులో అగార్కర్ పోటీపడ్డాడు.
గంగూలీతో ఉన్న చనువు కారణంగా చేతన్ శర్మ ఆ పదవిని దక్కించుకున్నాడు. అయితే ఒక టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ నిజాలను చేతన్ శర్మ బయటపెట్టాడు. దీంతో ఆ పదవి నుంచి అతడు వైదొలిగాడు. చేతన్ ప్లేసులో సెలెక్షన్ ప్యానెల్లో సభ్యుడైన శివ్‌సుందర్ దాస్‌ను తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ సెలెక్ట్ చేసింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోంది. అయితే చేతన శర్మ నార్త్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించేవాడు. అతడి స్థానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది బీసీసీఐ. ఇదే అజిత్ అగార్కర్‌కు అడ్డంకిగా మారింది. వెస్ట్ జోన్‌కు చెందిన అగార్కర్‌ను చీఫ్ సెలెక్టర్‌గా ఎలా నియమిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి.. అగార్కర్‌ను ఎంపిక చేస్తారా? లేదా ఇంకా ఏదైనా షాకులు ఇస్తారా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.