లసిత్‌ మలింగకు మాత్రమే ఈ ఘనతలు సాధ్యం!

malinga

‘లసిత్‌ మలింగ’ ఆ పేరు వింటే వికెట్లు తమపై జాలి చూపించాలని వేడుకుంటాయి. క్రీజులో ఉన్నది ఎంత గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా సరే.. అతను బంతి చేతికి తీసుకుంటే జంకాల్సిందే. యార్కర్‌ కింగ్‌, స్పీడ్‌స్టర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బిరుదులు మరెన్నో రికార్డులు. భిన్నమైన బౌలింగ్‌ యాక్షన్‌తో పదునైన యార్కర్లు సంధిస్తూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్లకు కూడా ముచ్చెమటలు పట్టించడం మలింగ నైజం. తాజాగా టీ20లకు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. గతంలోనే టెస్టు, వన్డేల నుంచి తప్పుకోవడంతో మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లైంది. దాదాపు దశాబ్దంపాటు టీ20ల్లో యార్కర్‌ కింగ్‌గా కొనసాగాడు లసిత్‌ మలింగ. మంలిగ్‌ కెరీర్‌లో అన్నీ అద్భుతాలే అతను సాధించిన ఘనతలు మరే బౌలర్‌ సాధించగలడన్న నమ్మకం అయితే ఎవరికీ లేదు.

malingaమలింగ అంతర్జాతీయ కెరీర్‌

మలింగ మొదట టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. జులై 1, 2004న ఆస్ట్రేలియాపై మొదటి టెస్టు ఆడాడు మలింగ. టెస్టు కెరీర్‌ను చాలా త్వరగానే ముగించాడు మలింగ. కేవలం 30 టెస్టులాడిన మలింగ 33.15 బౌలింగ్‌ సగటుతో 101 వికెట్లు తీశాడు. 2011లో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. జులై 17, 2004 యూఏఈపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మొత్తం 226 టెస్టులు ఆడిన మలింగ 28.87 బౌలింగ్‌ సగటుతో 338 వికెట్లు పడగొట్టాడు. వన్డే టాప్‌ వికెట్‌ టేకర్స్‌ జాబితాలో మలింగ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 2019లో మలింగ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం టీ20ల్లోనే కొనసాగాడు. కెరీర్‌లో 84 అంతర్జాతీయ టీ20లు ఆడిన మలింగ 20.36 సగటుతో మొత్తం 107 వికెట్లు తీశాడు. తాజా ప్రకటనతో మొత్తం అన్ని ఫార్మాట్ల నుంచి మలింగ తప్పుకున్నట్లైంది.

malingaరికార్డులు

కెరీర్‌లో ఎన్నో అరుదైన ఘనతలు మలింగ సొంతం. 2014 టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక బృందానికి నాయకత్వం వహించింది మలింగనే. 2019 సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌ సిరీస్‌లో అంతర్జాతీయ టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా మలింగ రాకార్డులకెక్కాడు. టీ20ల్లో టాప్‌ వికెట్‌ టేకర్‌ మలింగ(107)నే. టీ20ల్లో రెండు ట్యాట్రిక్‌లు నమోదు చేసిన ఘనత కూడా మలింగదే. టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డు కూడా ఉంది. ఈ ఘనత సాధించిన మరో బౌలర్‌ రషీద్‌ఖాన్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండుసార్లు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత మాత్రం ఇప్పటివరకు లసిత్‌ మలింగకు మాత్రమే సాధ్యమైంది. ఇప్పటివరకు వన్డే క్రికెట్‌లో మూడుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక బౌలర్‌ మలింగ. మొత్తం తన అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్‌ సాధించాడు మలింగ. తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు కూడా మలింగకు ఉంది(2010లో ఆస్ట్రేలియాపై ఆంజెలో మాథ్యూస్‌తో కలిసి 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఐపీఎల్‌లోనూ అదే జోరు

2009 నుంచి 2019 వరకు మలింగ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడాడు. 2009 ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన మలింగ 18 వికెట్లు తీశాడు. 2011లో 16 మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీశాడు. అందులో బెస్ట్‌ 13 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. మొత్తం ఐపీఎల్‌ కెరీర్‌లో 6సార్లు నాలుగు వికెట్లు తీశాడు మలింగ. 170 వికెట్లతో ఐపీఎల్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌లలో 19.80 బౌలింగ్‌ సగటుతో 170 వికెట్లు తీశాడు. 2019 సంవత్సరంలో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు.

కోచ్‌ మలింగను చూడబోతున్నామా?

లసిత్‌ మలింగ తన వీడ్కోలు సందేశంలో చెప్పిన ‘వచ్చేరోజుల్లో నా అనుభవాలను యువ క్రికెటర్లతో పంచుకుంటా’ అన్న మాట చూస్తుంటే మలింగ కోచ్‌ అవతారం ఎత్తబోతున్నాడని తెలుస్తోంది. శ్రీలంక లేదా ఐపీఎల్‌ జట్టు కోచింగ్‌ బృందంలో మలింగ కొనసాగుతాడని అందరూ భావిస్తున్నారు.