సౌత్ ఆఫ్రికాలో టెస్టు సిరీస్ విజయం సాధించాలన్న భారత్ కోరిక మరోసారి తీరలేదు. మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-1తో కైవసం చేసుకుంది. కాగా తొలి టెస్టులో అద్భుత విజయంతో 1-0 ఆధిక్యంలో ఉండి.. ఈ సారి సిరీస్ విజయం ఖాయం అనుకున టీమిండియా ఆశలపై సౌత్ ఆఫ్రికా నీళ్లు చల్లింది. ఈ సిరీస్ ఓటమితో టీమిండియా చేసిన తప్పులపై తీవ్ర స్థాయిలో చర్చజరుగుతోంది. వాస్తవానికి భారత్ ఆటగాళ్లు బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలం అయ్యారు. బౌలర్లు తమ పరిధిమేరా రాణించినా.. బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
రహానే, పుజారా పెద్ద మైనస్..
టెస్టు స్పెషలిస్టులు, సీనియర్ ఆటగాళ్ల అయినా అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారా ఈ సిరీస్‌లో దారుణంగా విఫలం అయ్యారు. ఈ సిరీస్ కంటే ముందు నుంచే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. అంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా అంతగా రాణించలేదు. అయినా కూడా వీరిద్దరిని బీసీసీఐ సౌత్ ఆఫ్రికా టూర్‌కు ఎంపిక చేసింది. వరుసగా రెండు టెస్టులలో విఫలం అయినా కూడా మూడో టెస్టులో స్థానం కల్పించడం విమర్శలకు తావిస్తోంది. రెండో టెస్టులో హాఫ్ సెంచరీలతో పర్వాలేదని పించిన విజయానికి ఆ మాత్రం ప్రదర్శన సరిపోలేదు.
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం..
ఆటగాళ్లు దారుణంగా విఫలం అవుతున్నా వరుసగా అవకాశాలు కల్పించారు. కానీ.. బెంచ్‌కే పరిమితం అయిన యువ క్రికెటర్లకు మాత్రం మొండిచేయి చూపించారు. జట్టు ఎంపికలో సరైన విధంగా వ్యవహరించలేదనే విమర్శ కూడా వినిపిస్తుంది. హనుమ విహారి లాంటి ఆటగాడికి సరైన అవకావం కల్పించలేదు. ఓపెనర్లలో తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన మిగతా రెండు మ్యాచ్‌లలో తేలిపోయారు. టెస్టు క్రికెట్‌లో ఓపెనింగ్ సరిగా లేకుంటే ఆ ప్రభావం మొత్తం మ్యాచ్‌పై పడుతుంది. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి టెస్టులో రాణించారు. తర్వాతి రెండు టెస్టుల్లో అత్యంత దారుణంగా విఫలం అయ్యారు. ఇలా టీమిండియా స్వయం తప్పిదాల వల్లే ఎక్కువగా నష్టపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి టీమిండియా సిరీస్ ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.