జనసేన-బీజేపీ మిత్రబంధానికి మధ్య లుకలుకలు వచ్చాయా? ఒకరంటే ఒకరికి పడటం లేదా? ఇప్పుడు ఇదే వార్త ఏపీ రాజకీయాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలం నుంచి ఈ రెండు పార్టీల మధ్య సయోద్య కుదరటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్, బద్వెల్ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఇక ఏపీలోని బద్వెల్ ఉప ఎన్నిక విషయానికొస్తే.. గతంలో ఈ స్థానంలో ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత సుబ్బయ్య మరణించటంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మొదట్లో అధికార పార్టీతో సహా అన్ని పార్టీలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించాయి. ఇక ఉన్నట్టుండి ఈసీ నోటిఫికేషన్ విడుదల అనంతరం జనసేన, టీడీపీ పార్టీలో కాస్త మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి అధికార వైసీపీ సుబ్బయ్య భార్య సుధను పోటీలో దించగా టీడీపీ కూడా నెలన్నర కిందటే ఓబుళాపురం రాజశేఖర్ ను అభ్యర్ధిగా ప్రకటించాయి. దీంతో ఈ సారి ఉప ఎన్నిక మరింత ఆసక్తిగా మారనుందని అందరూ అనుకున్నారు.
అయితే ఏపీలో జనసేన-బీజేపీ మిత్ర బంధాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక బద్వెల్ ఉప ఎన్నిక అభ్యర్ది ఎంపిక విషయంలో ఇరు పార్టీల చర్చల కారణంగా కాస్త ఆలస్యమవుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉప ఎన్నికలో పోటీ చేయటం లేదని చెప్పాడు. ఇటీవల ఏపీ పర్యటనలో పాల్గొన్న ఆయన బద్వెల్ ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేయట్లేదంటూ స్పష్టం చేశారు. దీని కారణం వైసీపీ నేత సుబ్బయ్య మరణం కారణంగా ఉప ఎన్నిక జరగబోతుందని, దీంతో వారి భార్య పోటీలో నిలబడటంతో ఆమెను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇక ఈ క్రమంలోనే టీడీపీ సైతం బద్వెల్ ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నామంటూ ఆదివారం స్పష్టం చేసింది.
ఇక ఇదిలా ఉంటే బీజేపీ తరుపున తమ అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ నేత సోమువీర్రాజు తెలపటంతో జనసేన-బీజేపీ మిత్రబంధం చెడిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇక్కడే రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయనే ప్రచారం మాత్రం కాస్త జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల స్నేహ బంధానికి కాలం చెల్లిందని, రానున్న రోజుల్లో ఎవరి దారిన వాళ్లు వెళ్లనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక్కడ మరో విషయం బద్వెల్ ఉప ఎన్నికల్లో అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీలు ఒకేసారి పోటీ నుంచి తప్పుకోవంటంతో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసిపోనున్నాయా అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో భవిష్యత్ లో ఈ రెండు పార్టీలు దోస్తీ చేయనున్నాయనే కారణంతోనే వీరి ఈ పోటీ నుంచి తప్పుకున్నాయంటూ తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో జనసేన బీజేపీ మిత్రబంధాన్ని కొనసాగించనుందా? లేదంటే టీడీపీతో మళ్లీ జతకట్టనుందా అనే ప్రశ్నలు గుప్పుమంటున్నాయి. ఇక ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మరిన్ని రోజులు ఆగక తప్పదు.