మైనర్ బాలికను మోసం చేసిన మరో టిక్ టాక్ స్టార్

vignesh

క్రైం డెస్క్- సోషల్ మీడియా.. ఇప్పుడు ఇది లేకుండా మన జీవితాన్ని అస్సలు ఊహించుకోలేము. మన నిత్య జీవితంలో సోషల్ మీడియా ఓ ప్రధాన భాగం అయిపోయింది. టిక్ టాక్, యూట్యూబ్, ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా సోషల్ మీడియాకు అలవాటైన మనం అవి లేకుండా ఉండాలంటేనే భయమేస్తుంది. ఐతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. మంచితో పాటు చెడు కూడా జరుగుతోంది. ప్రధానంగా సోషల్ మీడియా ద్వార యువత పెడదారి పడుతోందన్న వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియా వలలో పడి మోసపోతున్నారు.

vignesh

సోషల్ మీడియా క్రేజ్ లో పడి కొంత మంది యువతులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకు ఇటీవల జరిగిన ఫన్ బకెట్ భార్గవ్ సంఘటనే ఒక ఉదాహరణ. భార్గవ్ టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడు. ఇటీవలే వెలుగులోకి రావడంతో ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. చాలా మంది అమ్మాయిలను మోసం చేసిన ఫన్ బకెట్ బార్గవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. టిక్ టాక్ భార్గవ్ చేసిన మోసాలు, ఘటనలు మరవక ముందే తాజాగా మరో టిక్ టాక్ స్టార్ ఒక మైనర్ బాలికను గర్భవతిని చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

తాజాగా కేరళలోని త్రిస్సూర్‌ జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారం, గర్భవతిని చేసిన కేసులో 19 ఏళ్ల టిక్‌ టాక్‌ స్టార్‌ అంబిలి అకా విఘ్నేష్‌ కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విఘ్నేష్ కృష్ణకు గతేడాది 17 ఏళ్ల ఓ మైనర్ బాలికతో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయ్యింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది. దీంతో తరుచూ వారు కలుసకునేవారు. ఒక రోజు ఆ బాలిక తనను కలవడానికి వచ్చిన సమయంలో విఘ్నేష్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ మధ్య బాలిక గర్భవతి కావడంతో విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.