హెల్త్ డెస్క్- కరోనా మహమ్మారి చాప కింద నీరులా విజృంబిస్తోంది. ప్రపంచంలోని దేశాలన్నీ కరోనాకు వణికిపోతున్నాయి. మొదటి వేవ్ తో ఆగకుండా రెండో వేవ్ తో వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. ఇక కరోనానే అనుకుంటే.. అది ఈ యేడాది బ్లాక్ ఫంగస్ ను తెచ్చింది. అక్కడితో ఆగకుండా తరువాత వైట్ ఫంగస్ , ఇప్పుడు ఎల్లో ఫంగస్.. ఇలా రోజుకో ఫంగస్ వచ్చి పడుతూ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తోంది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లే ప్రమాదకరం అనుకుంటే.. తాజాగా వచ్చిన ఎల్లో ఫంగస్ మరింత డేంజర్ అని హెచ్చరిస్తున్నారు. ఎల్లో ఫంగస్ మొట్టమొదటి సారి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఇది బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌ల కంటే ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎల్లో ఫంగస్ సోకిస వ్యక్తికి ప్రముఖ ఈఎన్‌టీ నిపుణుల స్పెషలిస్టు నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. ఎల్లో ఫంగస్ లక్షణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని గుర్తించారు. మనిషిలో బద్దకం ఎక్కువగా ఉండటం, నిదుర మత్తు కలిగి ఉండటం, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. ఎల్లో ఫంగస్ మరింత తీవ్రంగా మారిందంటే మనిషిలో చాలా మార్పులు వస్తాయట. ఒంటిపై ఏమైనా గాయాలుంటే ఆ గాయాలు మానకపోవడం, గాయాలు మానేందుకు చాలా రోజుల సమయం పట్టడం, ఒంట్లో శరీర భాగాలు పనిచేయకపోవడం, కళ్లు లోపలికి పోవడం వంటి మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ శరీరంలో అంతర్గతంగా ఏర్పడి, శరీర బాగాలపై దాడి చేస్తుందని వైద్యులు గుర్తించారు. అందుకే ఎల్లో ఫంగస్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులు చూచిస్తున్నారు.
ఏ మాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్లో ఫంగస్‌కు యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్ ఇచ్చి సమర్ధవంతంగా చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక ఎల్లో ఫంగస్ సోకడానికి ప్రధాన కారణం పరిసరాలు శుభ్రంగా లేకపోవడమే అని నిపుణులు చెప్పారు. అందుకే వ్యక్తిగత శుభ్రత తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంటిలో తేమ శాతం కూడా చూసుకుంటూ ఉండాలని నిపుణులు అంటున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని చెప్పారు.