పొలంలో మెరుపు మెరిసింది.. క్షణాల్లో కోటీశ్వరుడైన రైతు

former

కర్నూలు రూరల్- ఆరుగాలం కష్టపడి పనిచేస్తేనే అన్నదాత కడుపు నిండుతుంది. ఎండనకా, వాననకా సేద్యం చేస్తేనే రైతుకు నాలుగు గింజలు దక్కుతాయి. భూమిని నమ్ముకుని బ్రతుకుతున్న అన్నదాతకు నకిలీ విత్తనాలు, అకాల వర్షాలు, గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి ఎన్నో సమస్యలు వేదిస్తాయి. ఆయినప్పటికీ పుడమి తల్లిని నమ్ముకుని నిరంతరం వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెడుతున్నారు రైతులు. వ్యవసాయంలో కష్ట, నష్టాలను అనుభవిస్తున్న ఓ రైతుకు మాత్రం అనుకోని అదృష్టం వరించింది. ఏళ్ల తరబడి కష్టపడి సాగు చేసినా ఎన్నడూ కనీసం లక్ష రూపాయలు కళ్ల చూడని ఓ రైతు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతున్నాడీ అన్నదాత.

former

అసలు విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతు తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేవలం పొలంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. పంటలు సరిగ్గా పండక చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటువంటి సమయంలో ఆ రైతును అదృష్టం వరించింది. ఎప్పిటిలాగే ఆ రైతు గురువారం ఉదయం తన పొలానికి వెళ్లాడు. తన పొలంలో దూరంగా ఏదో మిలమిలా మెరుస్తూ కనిపించింది. వేళ్లి చూస్తే అది వజ్రంలా అనిపించింది. వెంటనే దాన్ని తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికైతే వెళ్లాడు కానీ ఏంచేయాలో అతనికి పాలుపోలేదు. కాసేపు ఆలోచించాక స్థానికంగా ఉండే బంగారు వ్యాపారం చేసే జువెల్లరీ షాప్ యజామాని దగ్గరకు తనకు దొరికిన మెరుస్తున్న రాయిని తీసుకెళ్లాడు.

సదరు వ్యాపారీ దాన్ని పరీక్షించి అది అత్యంత విలువైన వజ్రం అని తేల్చాడు. వెంటనే ఆ వజ్రం ఖరీదు 1 కోటి 20 లక్షల రూపాయలుగా నిర్ధారించి, ఆ డబ్బులను రైతుకు ఇచ్చి పంపించాడు. ఎన్నడూ లక్ష రూపాయలు కూడా కళ్లచూడని రైతు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఎంచక్కా 1కోటి 20 లక్షల రూపాయలను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఐతే ఈ విషయం ఆనోటా ఈ నోటా మరి కొంత మంది బంగారం వ్యాపారులకు తెలిసింది. ఆరా తీస్తే 30 క్యారెట్ల బరువు ఉన్న ఆ వజ్రం సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు. దీంతో రైతుదే కాదు, ఆ బంగారం వ్యాపారిది కూడా అదృష్టమేనని, ఏకంగా 80 లక్షల రూపాయల లాభం ఆర్జించాడని అంతా అంటున్నారు.