టిక్ టాక్ లో ప్రేమలు చూశాం. కానీ ఇది ట్రాయాంగిల్ పెళ్లి స్టోరీ. దీని గురించి తెలుసుకుంటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. నిజంగా జరిగిందా, అబ్దద్ధం చెబుతున్నారా అనుకుని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. కానీ ఇది నిజంగానే జరిగింది. ఓ భార్యే దగ్గరుండి భర్తకి పెళ్లి చేసింది. అది కూడా అతడు ప్రేమించిన అమ్మాయితో. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ అయితే.. అసలు ఊరుకోవడం లేదు. ఇలాంటోళ్లు ఎక్కడుంటార్రా బాబు అని ఒకటే కామెంట్స్ పెడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని అంబేడ్కర్ నగర్ కి చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదివాడు. లాక్ డౌన్ ఇంట్లోనే ఉంటూ టిక్ టాక్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అలా అతడికి విశాఖపట్నంకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు. ఏమైందో ఏమో కానీ తర్వాత ఆమె నుంచి దూరమయ్యాడు. ఆపై టిక్ టాక్ లోనే పరిచయమైన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
సరిగ్గా ఈ సమయంలో విశాఖకు చెందిన యువతి కొన్నాళ్లు ఎదురుచూసింది. ఎంతకీ యువకుడి నుంచి కాల్ రాకపోయేసరికి.. నేరుగా తిరుపతి వచ్చేసింది. తీరా వచ్చాక అతడికి పెళ్లయిపోయిందని తెలిసింది. అయినా సరే ఎక్కడా నిరాశపడకుండా అతడి భార్యతో మాట్లాడింది. తాను ఇక్కడే ఉంటానని, అందరం కలిసుందామని చెప్పింది. ఇది విన్న భార్య తొలుత అయోమయానికి గురైంది. మరి ఏమైందో ఏమో గానీ చివరకు ముగ్గురూ కలిసి ఉండటానికి ఒప్పుకుంది. దీనితో పాటు ఆ యువతితో తన భర్తకు పెళ్లి చేయడానికి కూడా సిద్ధపడింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తానే దగ్గరుండి మరీ భర్త, అతడి ప్రియురాలిని అలంకరించి పెళ్లి చేసింది.
ఇదీ చదవండి: ఖైదీలకు బంపర్ ఆఫర్.. జైల్లోనే భాగస్వామితో గడిపేందుకు అవకాశం!