సాయి ధరమ్ తేజ్ ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం!

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే రోడ్డు ప్రమాదానికి ముఖ్య కారణం అక్కడ పేరుకు పోయిన ఇసుక అని తేలింది.

susgan minరాత్రి 8 గంటల సమయంలో కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా రూట్‌లో వెళ్తున్న సమయంలో సాయిధరమ్‌తేజ్‌ ప్రయాణిస్తున్న బైక్‌ కు యాక్సిడెంట్‌ అయింది. సీసీటీవీ దృశ్యాల్లో సాయి ధరమ్ మరీ అంత వేగంగా ఏమీ బైక్‌ను డ్రైవ్ చేయడం లేదని తేలింది. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకే సాయి ధరమ్ బైక్ స్కిడ్ కావడానికి కారణంగా తెలుస్తోంది. సహజంగా స్పోర్ట్స్ బైక్స్ ఇసుకపై స్కిడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కాగా, సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదానికి గురైన ప్రాంతంలో రోడ్డు పక్కన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఇసుక, మట్టి రోడ్డుపై పడడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

కేబుల్‌ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు రోడ్డుపై ఎక్కడా ఇసుక లేదు. కేవలం సాయిధరమ్‌తేజ్‌ బైక్‌ ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రమే ఇసుక ఉంది. దాంతో అక్కడ వెంటనే ఇసుక తొలగించారు. ఇదిలా ఉంటే.. హీరో తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు అధికారులు. రోడ్ల మీద వ్యర్థాల ను వేస్తున్న వారిపై కొరడా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాదాపూర్ ఖానామెట్ లో నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్ర్సక్షన్ కంపెనీ కి లక్ష రూపాయల జరిమానా విధించారు. భారీ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్న రోడ్లపై నిర్లక్ష్యంగా ఇసుక.. ఇతర వ్యర్థాలను వేస్తే సహించేది లేదని అధికారులు అంటున్నారు.