హైదరాబాద్ వాసులు నిన్నటి వరకు వీధి కుక్కల దాడితో బెంబెలెత్తితే.. ఇక తాజాగా వర్షాకాలం ప్రారంభం కాకముందే మ్యాన్‌హోల్స్ సమస్యలతో బాధపడుతున్నారు. నేడు మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన సంగతి తెలిసిందే. నగర మేయర్ విజయలక్ష్మి బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ వివారలు..
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. దాదాపు గంట పాటు నగరవ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌లోని కలాసిగూడ ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మౌనిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిపై జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. చిన్నారి మౌనిక మృతి పట్ల మేయర్ విజయలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఈ దారుణం చోటు చేసుకుందని మండిపడ్డారు. మ్యాన్‌హోల్స్ మూసేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
హైదరాబాద్‌లో శనివారం తెల్లవారుజాము నుంచే కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్లపై నిలిచిన వర్షం నీరు వెళ్ళడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్‌హోల్ తెరిచారు. ఇక ఇదే సమయంలో చిన్నారి పావని పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు.. మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాలు కోల్పోయింది. వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పార్క్ లైన్ మ్యాన్‌హోల్ వద్ద చిన్నారి మౌనిక మృతదేహాం లభ్యమైంది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
మౌనిక ప్రస్తుతం స్థానికంగా ఓ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతుంది. మౌనిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్లే మౌనిక ప్రాణాలు కోల్పోయిందని చెబుతున్నారు. అయితే హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్స్‌లో పడి చిన్నారులు మృతి చెందటం ఇది తొలిసారి కాదు. గతంలోనూ నగరంలో అనేక ఘటనలు ఇలాంటివి చోటుచేసుకున్నాయి. అయినా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కానీ జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. వర్షం పడిన సమయాల్లో రోడ్లన్నీ జలమయం అవుతుంటాయి. దీని వల్ల మ్యాన్‌హోల్స్ అన్నీ వర్షపు నీటితో నిండిపోయి ఉంటాయి. ఇలాంటి సమయాల్లో రోడ్లపై నడిచే వారికి మ్యాన్‌హోల్స్ కనిపించవు. దీని వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరి మౌనిక ఘటన తర్వాత అయినా జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీరులో మార్పు మార్పు వస్తుందేమో చూడాలి.