ఇంటర్‌ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఇంటర్ పరీక్షలు ఆపలేమని తేల్చి చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది హైకోర్టు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం ఈ పరీక్షలు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది.

interexamx minఇప్పటికే కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువు విషయంలో అయోమయంలో ఉన్నారని.. ఇలాంటి సమయంలో మళ్లీ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే వారు గందరగోళంలో పడిపోతారని తల్లిదండ్రుల తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఈ విద్యార్థులు కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు కూడా రాయలేదని, వచ్చే ఏడు కూడా ఏవైనా అవాంతరాలు వచ్చి ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలు కూడా రాయలేకపోతే ఈ విద్యార్థుల నైపుణ్యాలను ఎలా పరిగణించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని ఇంటర్‌ బోర్డు తరఫు న్యాయవాది వివరించారు. ఇక విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసినప్పుడే పరిస్థితులను బట్టి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇరువర్గాల వాదనలూ విన్న హైకోర్టు చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని లంచ్ పిటిషన్ విచారణ చేపట్టిన హైకోర్టు… ఇంటర్ బోర్డు పరీక్షలకు నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందనీ ఈ సమయంలో పరీక్షలు ఆపడం సమంజసం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇలా చివరి నిమిషంలో పరీక్షల నిర్వహణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. పిటిషన్‌ వాపసు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. దీనికి పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంగీకారం తెలిపినట్లు సమాచారం.