తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు స్వర్గీయ నందమూరి తారకరామారావు.. అందరూ ఎన్టీఆర్ అని పిలుస్తారు. రాముడు, శ్రీ కృష్ణడి పాత్రలో ఆయనను చూసి నిజంగానే దేవుళ్లు ఇలాగే ఉంటారా అని అనుకునేవారు. అప్పట్లో ఆయన ఫోటోలకు పూజలు కూడా చేసేవారు.
తెలుగు ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్నారు నందమూరి తారకరామారావు. అందరూ ఆయనను ఎన్టీఆర్ అని పిలుస్తారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు, రావణాసుడు ఎలాంటి పాత్రలైనా ఆయన కోసమే సృష్టించబడ్డాయా అన్న విదంగా ఉండేవి. అప్పట్లో ఎన్టీఆర్.. కృష్ణుడు, రాముడు పాత్రల్లో ఉన్న ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించేవారని అంటారు. అంతటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో ఎన్టీఆర్.. శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న 54 అడుగుల ఎత్తయిన విగ్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై కొన్నిరోజులుగా అభ్యంతరాలు వెలువడుతున్నాయి. తాజాగా విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు ఇండస్ట్రీలో రాముడు, కృష్ణుడి పాత్రల్లో నటించి తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిర్ణయించారు. ఇందుకు పలువురు మద్దతు కూడా పలికారు.. ఎన్టీఆర్ విగ్రహాన్ని 54 అడుగుల ఎత్తులో శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడానికి సన్నద్దమయ్యారు. మే 28 న ఆయన శతజయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. ఓ పక్క విగ్రహ ఏర్పాట్లు కూడా చక చకా అవుతున్నాయి. ఈ క్రమంలో సినీ నటి కరాటే కళ్యాణి.. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ గొప్ప నటుడు అయితే ఆయన రూపంలో శ్రీకృష్ణావతారంలో ఉన్న విగ్రం ఏర్పాటు చేస్తే భవిష్యత్ లో కృష్ణుడు ఇలాగే ఉంటారని భవిష్యత్ తరాల వారికి తప్పుడు సందేశం అందించినట్లు అవుతుందని.. ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంపై పలు హిందూ సంఘాలు తీవ్రంగా అభ్యంతరాలు తెలిపారు. అంతేకాదు శ్రీకృష్ణ జేఏసీ, భారతీయ యాదవ సంఘం, ఆదిభట్ల కళాపీటం తదితరులు హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషనర్ల వాదనలు విన్న ధర్మాసనం విగ్రహ ఏర్పాటు పై స్టే విధించింది. తాజాగా హై కోర్టు తీర్పూపై కరాటే కళ్యాణి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ‘ఇప్పడే తీర్పు ఇచ్చారు.. 28న విగ్రహ ఏర్పాటు చేయకుండా కోర్టు జడ్జీగారు అనుకూల తీర్పు ఇచ్చారు.. జై శ్రీ కృష్ణ, నువు ఉన్నావు స్వామి’ అంటూ పేర్కొంది. మొత్తానికి మే 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు బ్రేక్ పడినట్టు అయ్యింది.