బీజేపీలో చేరబోతున్న తీన్మార్ మల్లన్న, సంచలనం రేపుతున్న భార్య లేఖ

హైదరాబాద్- తీన్మార్ మల్లన్న పేరు తెలంగాణ వాసులకు బాగానే పరిచయం. అందులోను రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్లకైతే తీన్మార్ మల్లన్న పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీలను వెనక్కి నెట్టి రెండో స్థానంలో వచ్చిన తీన్మార్ మల్లన్న జాతీయస్థాయిలో సెన్సేషన్ అయ్యాడు. అన్నట్లు తీన్మార్ మల్లన్న ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.

హైదరాబాద్ కు చెందిన ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న బెయిల్‌పై విడుదలయ్యాడు. ఐతే ఆ తరువాత మరో కేసులో మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయనను రిమాండ్‌కి పంపించారు. తీన్మార్ మల్లన్న జైలుకెళ్లి ఇప్పటికి 34 రోజులు అవుతోంది. ఆయనను జైలు నుంచి విడిపించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Mallanna 1

ఇక అసలు విషయం ఏంటంటే.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరబోతున్నారు. మల్లన్న కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన సొంత చానల్ క్యూ న్యూస్ అధికారికంగా ప్రకటించింది. తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరనున్నట్లు క్యూ న్యూస్ టీం స్పష్టం చేసింది. ప్రధాని నేరంద్ర మోదీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు క్యూ న్యూస్ తెలిపింది. పలు పోలీసు కేసులు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన తీన్మార్ మల్లన్నను విడుదల చేయించేందుకు ఆయన భార్య మమత ప్రయత్నిస్తోంది.

ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డాకి ఆమె లేఖలు రాశారు. తెలంగాణ ప్రభుత్వం తన భర్త మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని ఆయన భార్య ఆరోపిస్తోంది. అందుకే ఆయనను వెంటనే విడిపించాలని బీజేపీ పెద్దలను కోరినట్లు సమాచారం. మొత్తానికి తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తోంది.