కరోనా మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలు మామూలువి కావు. ఈ కష్ట కాలంలోనే ఇండియాకి ఓ రియల్.., సూపర్ హీరో దొరికాడు. ఆయనే సోనూసూద్. సినిమాలలో విలన్ గా నటించే ఈయన.., ఈ సంవత్సర కాలంలో రియల్ హీరో అయిపోయాడు. ముందుగా మొదటి వేవ్ లో వలస కార్మికుల కష్టాలని తీర్చాడు సోను. వారిని సురక్షితంగా ఇళ్ళకి చేర్చి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక అక్కడి నుండి సోనూసూద్ సేవా కార్యక్రమాలు చేస్తూనే వచ్చాడు. అడిగిన వాళ్ళకి లేదు అని చెప్పకుండా అన్నీ పనులు చేసి పెట్టాడు. ఇక ఈ కరోనా సెకండ్ వేవ్ లో ప్రభుత్వాలే చేతులు ఎత్తేసిన తరుణంలో ఈ రియల్ హీరోనే చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నాడు. ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో సోను ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్స్ నే నిర్మిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ దేశ రాజధాని ప్రజలకి ఒక శుభవార్తని అందించాడు. దేశంలో అన్నీ రాష్ట్రాలలో లానే ఢిల్లీలో కూడా కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. సరైన రీతిలో వైద్య సదుపాయాలు లేకపోవడం, ఆక్సిజన్, బెడ్స్ కొరత ఉండటంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలసి పోతున్నాయి. కోర్టులు తీవ్రంగా స్పందించినా ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సోను మంచి మనసుతో ముందుకొచ్చాడు.
ఢిల్లీలో ఎక్కువ కరోనా కేసులు ఉండటం,అక్కడి ప్రజల నుంచి ఆక్సిజన్ కోసం ఎక్కువ అభ్యర్థనలు వస్తుండటంతో.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించారు సోనూసూద్ . ఇందుకోసం ఒక హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ ప్రజలెవరైనా ఆక్సిజన్ కావాల్సి వస్తే 022-61403615 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను డోర్ డెలివరీ చేస్తారు. ఆక్సిజన్ కోసం కరోనా పేషెంట్లు అల్లాడుతున్న వేళ సోను సూద్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏకంగా ఇంటికే పంపిస్తానని చెప్పడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక రానున్న కాలంలో ఈ ఏర్పాటు అన్నీ రాష్ట్రాలలో చేయడానికి సోనూ ఫౌండేషన్ ఇప్పటికే ప్రణాళికలు సిద్దము చేస్తోందట. కరోనా మొదటి వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్యలో వచ్చిన విలువైన సమయాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోలేకపోయాము. వైద్య వ్యవస్థని పటిష్టం చేసుకోలేకపోయాము. కాబట్టి.. ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే సోనూసూద్ ఈసారి దీర్ఘకాలిక ప్రణాళికలతో పని చేస్తున్నాడట. ఏదేమైనా ఒక దేశ ప్రభుత్వం చేయాల్సిన పనిని సోనూ ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో చేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోనూసూద్ కి సాధ్యం అయ్యింది.., ప్రభుత్వాలకి ఎందుకు సాధ్యం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.