ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సమీర్ వాంఖడేకు భద్రత పెంపు

ముంబయి- బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముంబయిలోని సముద్ర తీరంలో భారీ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడు మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అదిగో అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇక షిప్ లో రేవ్ పార్టీ పై దాడులు నిర్వహించి, షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేయడంలో ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే కీలక పాత్ర పోషించారు. ఆయన స్వయంగా ఆర్యన్ ఖాన్ బృందాన్ని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అరెస్ట్ విషయం తెలియగానే షారుక్ చాలా పైస్థాయిలో తన కొడుకును విడిపించుకునేందుకు ప్రయత్నించినా, సమీర్ వాంఖడే మాత్రం ససేమిరా అన్నారు.

Sameerr 1

ఇదిగో ఇటువంటి సమయంలో తనకు ప్రాణహానీ ఉందని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే అనుమానం వ్యక్తం చేశారు. తనపై కొందరు నిఘా పెట్టినట్టు మహారాష్ట్ర డీజీపీకి వాంఖడే స్వయంగా ఫిర్యాదు చేశారు. తన కదలికలను ఎవరో గమనిస్తున్నారని ఆయన డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. వాంఖడే తరచుగా ముంబయిలోని తన తల్లి సమాధి ఉన్న శ్మశానానికి వెళ్తుంటారని తెలుస్తోంది.

ఐతే రెండు రోజుల క్రితం పోలీసు అధికారులమంటూ ఇద్దరు వ్యక్తులు ఆ శ్మశానం ఉన్న చోటుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని సేకరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సమీర్‌ వాంఖడేకు మహారాష్ట్ర పోలీసులు భద్రతను పెంచారు. ఆయనకు ప్రస్తుతమున్న బాడీగార్డ్స్ తో పాటు సాయుధ జవాన్ల సంఖ్యను పెంచారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం బయట కూడా పోలీస్ భద్రకను కట్టుదిట్టం చేశారు.