సర్కారువారి పాట షాక్.. మహేష్ ఫ్యాన్స్ కు నిరాశే

mahesh babu

ఫిల్మ్ డెస్క్- సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయనకు ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. మహేశ్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. దాదాపు అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టరే. మహేశ్ బాబు కొన్ని సినిమాలు నిరాశపరిచినా.. వాటికి కూడా మంచి పేరే వచ్చింది. దీంతో మహేశ్ సినిమా అంటేనే ఇండస్ట్రీతో పాటు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. ఈ మధ్య కాలంలో కొరటాల శివ తీసిన భరత్ అనే నేను, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి, అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు సక్సెస్ సాధించాయి. దీంతో మహేశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా మహేశా బాబు సర్కారు వారి పాట తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మాహనటి కీర్తీ సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.

sarkaruvari pata

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ యేడాది జనవరిలో సర్కారు వారి పాట మొదటి షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో జరిగిన షూటింగ్ లో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని ప్రేమ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. కరోనా పెరగడంతో అంతలోనే మళ్లీ వాయిదా వేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31 తేదీన సర్కారు వారి పాట నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఖచ్చితంగా సినిమా నుంచి వచ్చే టీజర్‌ అయి ఉంటుందని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అంతే కాకుండా సర్కారు వారి పాట మూవీ నుంచి పోస్టర్‌ గానీ, లేదా పాట గానీ వచ్చే విడుదల కావచ్చన్న టాక్ వినిపించింది.

ఇంకేముంది సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఈనెల 31 కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిగో ఇలాంటి సమయంలోనే మహేశ్ బాబు టీమ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్‌ను చెప్పింది. మహేశ్ బాబు టీమ్ పేరిట తాజాగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు బాగోలేని కారణంగా సర్కారు వారి పాట నుంచి ఎటువంటి అప్‌డేట్ రావడం లేదు. మా పేరిట వచ్చే ఏ అప్‌డేట్‌నూ నమ్మకండి. ఏదైనా ఉంటే మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియజేస్తాం. అలాగే, మే 31నే బీఏ రాజు గారి 11వ రోజు కూడా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మహేశ్ బాబు టీం పేర్కొంది. దీంతో ఇప్పట్లో సర్కారు వారి పాట కు సంబందించి ఏ సర్ ప్రైజ్ ఉండబోదని తెలిసి అభిమానులు ఉస్సూరుమంటున్నారు.