ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా కాలంగా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు సల్మాన్. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచ వ్యాప్తం కావడంతో చాలా మంది హీరోలు, హీరోయిన్ల మాదిరిగానే సల్మాన్ ఖాన్ సైతం తెలుగు సినిమాలపై దృష్టి సారించారు. ఈ మేరకు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి ఆయన సినిమాలు చేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని సల్మాన్ ఖాన స్వయంగా కన్ ఫర్మ్ చేశారు. అంతే కాదు సల్మాన్ మరో ఆసక్తికరమై విషయాన్ని కూడా చెప్పారు. విక్టరీ వెంకటేశ్ తో సైతం సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయబోతున్నారట.
అంతిమ్ సినిమా మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ సినిమా చేయవచ్చు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన సల్మాన్ ఖాన్.. దబాంగ్ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాం.. కానీ అంతిమ్ సినిమాకు అంత సమయం లేదు.. కరోనా కారణంగా.. గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వచ్చింది.. అందుకనే ఈసారి డబ్బింగ్ పై ఫోకస్ పెట్టలేదు.. అయితే నా తదుపరి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుదల చేస్తాను .. అని చెప్పారు.
అంతే కాదు తెలుగులో చిరంజీవితో సినిమా చేస్తున్నారటగా అని అడగగా.. దానికి ఆయన అవునని సమాధానం చెప్పడమే కాకుండా వెంకటేశ్ తోనూ ఓ సినిమా చేస్తున్నానని తెలిపారు సల్మాన్ ఖాన్. ఐతే ఇందుకు సంబందించిన వివరాలుత్వరలోనే చెబుతానని అన్నారు సల్మాన్ ఖాన్. నేను క్లాస్ సినిమా, మాస్ సినిమా, మల్టీప్లెక్ సినిమా అని చూడను అని చెప్పిన సల్మాన్.. కథ నచ్చిందా.. లేదా.. అని మాత్రమే చూస్తానని అన్నారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ తెలుగులో రెండు సినిమాలు చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.