రాంగోపాల్ వర్మ కొండా మూవీ పోస్టర్, సినిమా గురించి వర్మ వీడియో

ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వ‌ర్మ.. ఇప్పుడంటే వెబ్ సిరీస్, యాంకర్స్ తో అశ్లీల ఇంటర్వూలు, మందుపార్టీల్లో డ్యాన్సులు చేస్తూ కొంత దిగజారి పోయారు గానీ.. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే సంచలనాలకు మారు పేరు. వర్మ సినిమా అంటేనే ఓ సెన్సేషన్. ప్రేమ కధను చెప్పాలన్నా, దెయ్యాన్ని చూపించాలన్నా, మాఫియాను తెరకెక్కించాలన్నా, ఫ్యాక్షన్ గొడవలను చిత్రీకరించాలన్నా అది ఒక్క ఆర్జీవీకే సాధ్యం అన్నంతగా పేరు తెచ్చుకున్నారు.

అందుకే రాంగోపాల్ వర్మ ఏంచేసినా, ఏ సినిమా తీసినా సెన్సేష‌న్ సంచలనం అవుతూవస్తోంది. ప్రధానంగా వర్మది ఫ్యాక్షన్ సినిమాలు తీయడంతో అందెవేసిన చెయ్యి. గతంలో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ గ్రౌండ్ లో రక్తచరిత్ర రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ‌, తాజాగా తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఈమేరకు ‘కొండా’ పేరుతో ఓ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశారు ఆర్జీవి. కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవిత చరిత్రను రాంగోపాల్ వర్మ వెండితెరకెక్కించబోతున్నారు.

rgv konda couple biopic 1

ఇక తెలంగాణలో కొండా దంప‌తుల‌ గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరి కథని వర్మ సినిమాగా తీస్తున్నారు. ప్రముఖ నక్సల్ నాయకుడు ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ వరంగల్‌ పరిసర ప్రాంతాల్లో మొదలుపెట్టనన్నట్లు ఆర్జీవి చెప్పారు. కొండ మురళి చదువుకున్న కాలేజీలు, కొండా సురేఖ తో అతని పరిచయం, పెళ్లి,, ఆ తర్వాత వారు రాజకీయాల్లోకి వచ్చిన పరిణామం వంటి అంశాలన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు వర్మ.

ఇక కొండా దంపతులపై సినిమా తీసేందుకు ఇప్పటికే రాంగోపాల్ వర్మ చాలానే కసరత్తు చేశారు. వారి కధను తెలుసుకునేందుకు వరంగల్ లో పర్యటించి పూర్తి వివరాలను సేకరించారు. అంతే కాదు స్వయంగా కొండా మురళిని కలిసి సినిమా గురించి వివరించి, ఆయన నుంచి కూడా పలు అంశాలను తెలుసుకున్నారు ఆర్జీవి. కొండా దంపతులపై సినిమా ఎందుకు, ఎలా తీస్తున్నాడన్నదానిపై రాంగోపాల్ వర్మ ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో, కొండా సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.