ఫిల్మ్ డెస్క్- డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. వేయించుకోవడమే కాదు, తాను వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి అందరికీ చెప్పి.. అందరు టీకా తీసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా 18 ఏళ్లకు పైబడిన అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని మంచు లక్ష్మి కోరింది. వ్యాక్సిన్ వేసుకున్నాక కాస్త రిలీఫ్ గా ఉందని, ఈ ఏడాది ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వాళ్లకి ఈ ఏడాది మొత్తానికి అదే హైలెట్ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదే ఇప్పుడు మంచు లక్ష్మి కొంప ముంచింది. తెలంగాణలో 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంది కూడా కేవలం రెండో డోసు తీసుకునే వారికి మాత్రమే టీకా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది సర్కార్. రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే మంచు లక్ష్మి మాత్రం ఎంచక్కా వ్యాక్సిన్ వేసేసుకుంది.
దీంతో నెటిజన్స్ మంచు లక్ష్మిపై మండిపడుతున్నారు. 45 ఏళ్ల లోపున్న మంచు లక్ష్మి వ్యాక్సిన్ ఎలా వేయించుకుందని విమర్శిస్తున్నారు. అది కూడా మొదటి డోసు నిలిపివేసిన నేపధ్యంలో మంచు లక్ష్మికి ఎలా వ్యాక్సిన్ ఇచ్చారని ప్రభుత్వంపైనా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. డబ్బు, సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి 45 ఏళ్ల లోపు ఉన్నా, మొదటి డోసు బ్యాన్ ఉన్నా, మంచు లక్ష్మి టీకా తీసుకుందని నెటిజన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. గతంలో మంత్రి కేటీఆర్ కి కరోనా వచ్చిన సమయంలో తన సినిమాలు చూడమని సరదాగా కామెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఎదుటివారిపై సెటైర్లు వేసే ముందు మన సంగతి చూసుకోవాలని హితువు పలుకుతున్నారు నెటిజన్స్. ఐతే దీనిపై ఇప్పటి వరకు మంచు లక్ష్మి గాని, మోహన్ బాబు కుటుంబం గాని మాత్రం స్పందించలేదు.