కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన కొండా సురేఖ

పొలిటికల్ డెస్క్- తెలంగాణ రాజకీయం అంతా ఇప్పుడు హుజూరాబాద్ చుట్టూ తిరుగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈమేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వనుండగా, అక్టోబర్ 30న పోలింగ్ జరగనుంది. ఇక నవంబర్ 2న ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాన్ని ప్రకటించనున్నారు.

ఈ మేరకు ఎప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోరా హోరిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్ధిగా రంగంలోకి దింపింది. అటు బీజేపీ పార్టీ తరపున మాజీ మంత్రి ఈటవ రాజేందర్ లేదంటే ఆయన సతీమణి ఈటల జమునా రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కంతా కాంగ్రెస్ పార్టీతోనే. ఎందుకంటే హస్తం పార్టీ ఇప్పటి వరకు హుజూరాబాద్ నుంచి ఎవరిని పోటీకి దింపాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదు.

konda surekhaa 1

నిన్నటి వరకు మాజీ మంత్రి కొండా సురేఖను హుజూరాబాద్ బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకు కొండా సురేఖ సైతం సుముఖత వ్యక్తం చేసింది. మరి ఇంతలో ఏమొచ్చిందో ఏమో గాని, హఠాత్తుగా కొండా సురేఖ మనసు మార్చుకుందని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయబోనని కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు సమాచారం.

హుజూరాబాద్ ఉప ఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న ఈ సమయంలో కొండా సురేఖ కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు కొండా సురేఖ చెయ్యివ్వడంతో, ఏంచేయాలన్నదానిపై కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. ఆఖరిరి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నే రంగంలోకి దించక తప్పదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.