టీఆర్ ఎస్ లో భారీ మార్పులు, కవిత సంచలన కామెంట్స్

kavitha

జగిత్యాల- టీఆర్ ఎస్ పార్టీలో ఆమె కీలకమైన నాయకురాలు.. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. మరి ఆమె ఏదైనా మాట్లాడితే ఆ మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అటువంటిది ఆమె పార్టీ గురించి వ్యాఖ్యలు చేస్తే అందరు దాని గురించే చర్చించుకుంటారు. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని కవిత అన్నారు. జగిత్యాలలో జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గం అభినందన సభలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ వేదికపై కవిత మాట్లాడారు.

mlc kavitha

ముందు ముందు ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ జరుగబోతున్నాయని కవిత చెప్పారు. ఐతే ఏది జరిగినా టీఆర్ఎస్‌ పార్టీకి మంచే జరుగుతుందన్న ఆమె, గులాబీ పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో రాజకీయంగా అనేక అంశాలు చర్చకు వస్తాయని కవిత అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన అనంతరం ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరిచుకుంది. భవిష్యత్తులో టీఆర్ఎస్‌ పార్టీలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలకు కవిత వ్యాఖ్యలు ఉతమిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గంలోను భారీ మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ జరుగుతున్న ఇటువంటి సమయంలో కవిత ఇలాంటి కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

క్యాబినెట్ తో పాటు టీఆర్ ఎస్ పార్టీలోను భారీ మార్పులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేశారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకే ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. పార్టీ పట్ల, సీఎం కేసీఆర్ కుటుంబం పట్ల అంతర్గత సమావేశాల్లో విమర్శలు చేస్తున్న వారందరిని కేసీఆర్ దూరం పెట్టబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే టీఆర్ ఎస్ లో సమూల ప్రక్షాళన ఉంటుందనే దానికి సంకేతంగానే కవిత ఇలా మాట్లాడారని తెలంగాణ భవన్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ముందు ముందు టీఆర్ ఎస్ లో, కేసీఆర్ మంత్రివర్గంలో ఏంజరగబోతోందన్న ఉత్కంఠ మాత్రం అందరిలోను నెలకొంది.