సీనియర్ నటి జీవితంలో కరోనా సమయంలో తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. ఆ విషాదాల కారణంగా ఆమె తీవ్రంగా కృంగిపోయారు. ఓ మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించారు.
కొందరి జీవితాల్లో కష్టాలు చుట్టపు చూపుగా వచ్చిపోతుంటాయి. కానీ, కొంతమంది జీవితాల్లో మాత్రం కష్టాలు ఇంట్లో మనిషిలాగానే అలానే ఉండిపోతాయి. అలాంటి సమయంలో వారి జీవితాలు తల్లకిందులయ్యే అవకాశాలే ఎక్కువ. ఆ కష్టాలకు తట్టుకుని నిలబడ్డవారు జీవితంలో ముందుకు వెళతారు. తట్టుకోలేని వారు ప్రాణాలు తీసుకుంటారు. ఇందుకు సెలెబ్రిటీలేమీ అతీతం కాదు. కష్టాల కారణంగా ప్రాణాలు తీసుకున్న సినీ సెలెబ్రిటీలు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఇంకా కొంతమంది ఆత్మహత్యలకు ప్రయత్నించి విఫలమై.. పిల్లల కోసం బతుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి కవిత ఒకరు.
ఆమె వరుస విషాదాల కారణంగా తీవ్రంగా కృంగిపోయారు. మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చివరకు బిడ్డల కోసం బతకాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె మీడియాతో వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ కరోనా కారణంగా మా ఆయన చనిపోయాడు. జయప్రద ఫోన్ చేసింది. ‘నీ భర్తలాంటి వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు’ అని అంది. అంతే! నా కళ్లలోంచి నీళ్లు ఆగలేదు. వెక్కివెక్కి ఏడ్చాను. మా ఆయన నన్ను ప్రాణంగా ప్రేమించే వాడు. ఆయన మరణించిన పది రోజులకే నా కుమారుడు సాయి కూడా చనిపోయాడు. ఈ వరుస విషాదాలను తట్టుకోలేకపోయాను. ఓ మూడు సార్లు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ, నా పిల్లల కోసం బతకాలని నిశ్చయించుకున్నాను.
సినిమా షూటింగ్‌ల్లో పడితే ఈ బాధ మర్చిపోవచ్చని నాకు అనిపించింది. ఓ తమిళ సీరియల్‌కు ఓకే చెప్పాను’’ అని అన్నారు. కాగా, సీనియర్ నటి కవిత బాల్య నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 300లకు పైగా సినిమాలు చేశారు. 1983లో దశరథ్ రాజ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన కరోనా కారణంగా 2021లో చనిపోయారు. మరి, జీవితంలో చోటుచేసుకున్న విషాదాలను తట్టుకుని నిలబడ్డ సీనియర్ నటి కవితపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.