ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ నేత కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో ఆమె విచారణకు రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చింది. కారణం ఏంటంటే...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత గురువారం రెండోసారి ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. గురువారం ఉదయం 11 గంటలకు ఆమె ఈడీ ముందు హాజరు కావాలి. కానీ 11.30 గంటల వరకు కూడా ఆమె ఈడీ ముందు హాజరు కాలేదు. అసలు కవిత విచారణకు వస్తందా లేదా అన్న ఉత్కంఠత నెలకొంది. ఈ క్రమంలో 11.30 గంటల తర్వాత కవిత ఈడీకి సమాచారం పంపింది. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని.. మరో రోజు వస్తానని తెలిపింది. అనారోగ్య కారణాల వల్లే ఈడీ విచారణకు హాజరు కాలేకపోతున్నానని కవిత వెల్లడించింది. మరో రోజు విచారణ తేదీ నిర్ణయించాలని కోరింది. ఈ క్రమంలో కవిత న్యాయవాది సోమ భరత్.. ఈడీ అధికారులకు ఈ విషయం తెలిపారు.
ఇక ఈ కేసులో ఈ రోజు అనగా మార్చి 16న జరిగే విచారణ ఎంతో కీలకం. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన రామచంద్రపిళ్లై కస్టడీ నేటితో ముగియనుంది. అలానే సిసోడియా కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈడీ ఈ ముగ్గురని కన్‌ఫ్రంటేషన్‌లో విచారించాలని భావించింది. కానీ నేడు కవిత విచారణకు గైర్హాజరైతే.. కన్‌ఫ్రంటేషన్‌లో విచారించేందుకు అవకాశం లేకుండా పోతుంది. అంతేకాక మార్చి 24న సుప్రీంకోర్టులో తన పిటిషన్ విచారణ ఉన్నందున.. కవిత విచారణకు హాజరు కాలేనని తెలిపింది. ఈ నేపథ్యంలో కవిత అభ్యర్థనపై ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈడీ విచారణ నేపథ్యంలో కవిత.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇక కవిత ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని కేసీఆర్ నివాసం వద్ద భారీ హడావుడి నెలకొంది. కవితకు మద్ధతుగా రాష్ట్ర మంత్రులు, కీలక నేతలు ఢిల్లీకి బయలుదేరారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు న్యాయ నిపుణులతో చర్చలు జరిపారు. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి నేతలు ఢిల్లీకి భారీగా చేరుకున్నారు. కవిత విచారణ నేపథ్యంలో ఢిల్లీలోని కేసీఆర్ నివాసం, ఈడీ ఆఫీస్ పరిసరాల్లో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కేసీఆర్ నివాసం ముందు పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.
ఇక ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఒక మహిళను ఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడంపై అభ్యంతరం తెలుపుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తమకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ వాస్తవంగా అలా చేయలేదని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ ఫోన్లు సీజ్ చేశారని కవిత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాక సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం.. ఒక మహిళను తన ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా.. ఈడీ తనను కార్యాలయానికి పిలవడంపై కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ నిరాకరించారు. కవితను షిటిషన్‌ను తక్షణమే విచారణ చేపట్టేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్చి 24న పిటిషన్‌పై వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. ఈ క్రమంలో కవిత నేడు విచారణకు హాజరు కాకపోవడం సంచలనంగా మారింది. మరి ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి కవిత ఈడీ విచారణకు హాజరుకాకపోవడంపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.