కేఏ పాల్ సంచలన నిర్ణయం.. ఆనందయ్య తో కలిసి మందు తయారీ

విశాఖపట్నం- కేఏ పాల్.. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ప్రముఖ మత గురువు అయిన కేఏ పాల్.. ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాధినేతలతో నేరుగా మాట్లాడే చొరవ ఉన్న కేఏ పాల్.. ఆ తరువాత ఎందుకో చల్లబడి పోయారు. ఏదేశానికి వెళ్లాలన్నా సొంత బొయింగ్ విమానం కలిగిన కేఏ పాల్ రాజకీయాల్లోకి వచ్చి కొంత చులకనయ్యారని చెప్పవచ్చు. ప్రజా శాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. సరే ఇప్పుడు అదంతా పక్కన పెడితే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఔషధం పై స్పందించారు కేఏ పాల్. ఆనందయ్య మందుపై ప్రశంసల జల్లు కురిపించారు.

KA Paul

ప్రైవేట్ ఆసుపత్రులు ఘోరంగా దోచుకుంటున్న ఇలాంటి క్లిష్ట సమయంలో ఆనందయ్య ఆయుర్వేద మందును తయారు చేయడం అభినందిచతగ్గ విషయమని కేఏ పాల్ అన్నారు. తన తల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఐతే అందరిపై నిందలు వేయలేమని, కానీ కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం దోచుకుతింటున్నారని కేఏ పాల్ ఆరోపించారు. కరోనా ఉధృతి కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారని వ్యాఖ్యానించారు. ప్రకృతి సహజంగా లభించిన వన మూలికలతో కరోనా ఔషధాన్ని తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాల్సిన భాధ్యత అందరిపైన ఉందన్నారు కేఏ పాల్. ఆనందయ్య ఉన్న చోటికి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.

ఆనందయ్య కరోనా మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయని గుర్తు చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న ఆనందయ్యను వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరాలని అందరికి సూచించారు. ఇక కరోనాకు నిర్ధిష్టమైన ఔషధం లేని నేపధ్యంలో కరోనాపై పోరుకు ఆనందయ్య తమతో చేతులు కలపాలని కేఏ పాల్ కోరారు. ఆనందయ్యతో కలిసి తమ సంస్థ ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. తమ సంస్థ వెబ్‌ సైట్‌ లో రిజిస్టర్ చేయించుకోవాలని సూచించారు. మందు తయారీకి కావలసిన వన మూలికలను తెచ్చుకుంటే.. కావలసిన ఏర్పాట్లు చేస్తామని, ఉచితంగా శిక్షణ అందిస్తామని కేఏ పాల్ తెలిపారు. మరి కేఏ పాల్ ప్రతిపాదనపై ఆనందయ్య ఏమంటారన్నదే ఆసక్తిరేపుతోంది.