14 జిల్లాలకు రెడ్ అలర్ట్, హైదరాబాద్ వాసులు మంరిత జాగ్రత్తగా ఉండాలి

హైదరాబాద్- తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు జన జీవనం అస్తవ్యస్థమైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ఆదివారం రాత్రి తీరం దాటి వాయుగుండంగా బలహీనపడటంతో ప్రస్తుతం మహారాష్ట్రలోని విదర్భ, చత్తీస్‌గడ్, తెలంగాణ సమీపంలో ఇది కేంద్రీకృతమై ఉంది.

దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావం దృష్ట్యా తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తెలంగాణలోని మొత్తం 14 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

Heavy Rains

రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌ లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. నగర వాసులు సాధ్యమైనంత వరకు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.

ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక సోమవారం సాయంత్రం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదారాబాద్ నగరంలో నల్లటి మేఘాలతో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలోనే రాత్రి అయినట్లుగా వాతావరణం కనిపించింది. హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.