ఈటల సిగ్గుంటే ఆ పని చెయ్ ! హద్దులు దాటిన ఈటల.. గంగుల వార్!

రాజకీయాల్లో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరు అంటారు. ఈ మాటని ఇప్పుడు అక్షరం సత్యం చేస్తున్నారు టి.ఆర్.ఎస్ నాయకులు. నిన్నమొన్నటి వరకు అన్న, తమ్ముడు అని అనుకున్న వారే ఇప్పుడు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య మాటలు హద్దులు దాటేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు టి.ఆర్.ఎస్ లో ఈటల స్థానం ప్రత్యేకం. సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లినా కాని పనులు.., ఈటల దగ్గరికి వెళ్తే అయిపోతాయి అని పార్టీ నాయకులు భావించేవారు. కానీ.., ఒక్కసారిగా రాజేందర్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు రావడం, ఆయన్ని వెంటనే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఎప్పుడైతే రాజేందర్ మంత్రి పదవి పోయిందో అప్పటి నుండి మంత్రి గంగుల కమలాకర్ ఆయన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. టి.ఆర్.ఎస్ లో ఉన్నందు వల్లే రాజేందర్ కి గౌరవం అని.., పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఆదేశాలను ఎలా ధిక్కరిస్తారని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మంత్రి కమలాకర్ రాజేందర్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. దీంతో.. ఈటల కూడా గంగులపైకి విమర్శలు గురి పెట్టి వదిలారు. మంత్రి గంగుల కమలాకర్ గ్రానైట్ గనులు అక్రమంగా నడుపుతూ ప్రభుత్వానికి పన్నులు ఎగవేసి ఆస్తులు సంపాదించాడని ఈటల రాజేందర్ కాస్త ఘాటైన విమర్శలే చేశాడు. కాగా.. ఈ కామెంట్స్ పై మంత్రి గంగుల కమలాకర్ తాజాగా స్పందించారు.

gangu 2

నేను రాజకీయాల్లోకి రాక ముందు నుండి గనుల వ్యాపారంలోనే ఉన్నాను. కరీంనగర్లో 350 గ్రానైట్ క్వారీలు ఉంటే.., వీటిలో నా పేరు మీద ఉన్న క్వారీ ఒక్కటి మాత్రమే. ప్రభుత్వానికి కట్టాల్సిన అన్నీ పన్నులు కట్టే.., ఇన్నాళ్ల నుండి వ్యాపారం చేస్తున్నాను. నేను పన్ను ఎగవేత దారుడిని అని ఈటల నిరూపించగలిగితే.. ఎగవేసిన దానికి 5 రేట్లు చెల్లిస్తా. ఈటల రాజేందర్ నువ్వు నిరూపించగలావా అని సవాలు చేశారు టి.ఆర్.ఎస్ మంత్రి. ఇక గంగుల కమలాకర్ ఇదే సమయంలో మాజీ మంత్రిపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.”ఈటల రాజేందర్ అసైన్డ్ భూముల విషయంలో నిన్ను దోషిగా తేల్చారు. సిగ్గుంటే ఆ భూములను ప్రభుత్వానికి ఇచ్చేయ్. నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. నేను కూడా బీసీ బిడ్డనే. నీకన్నా నాకు ఆత్మగౌరవం ఎక్కువ. రాజకీయ భిక్ష పెట్టిన టి.ఆర్.ఎస్ పార్టీపై విష ప్రచారాలు ఆపి, దమ్ముంటే ఎన్నికలకు సిద్ధం అవ్వాలంటూ గంగుల సవాలు విసిరారు. ఇక ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్లోపార్టీని కాపాడుకుంటా’’ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కానీ.., నిన్న మొన్నటి వరకు రాజేందర్ ని అన్న అంటూ పిలిచిన గంగుల ఆయన్ని ఇంతలా టార్గెట్ చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గంగులకి కేసీఆర్ మద్దతు ఉందని.., ఆయనే కావాలని ఓ బీసీ నాయకుడైన రాజేందర్ పై, మరో బీసీ నాయకుడైన గంగుల కమలాకర్ చేత విమర్శలు చేయిస్తున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి గంగుల, ఈటల మధ్య పొలిటికల్ వార్ రానున్న కాలంలో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.