వినాయక చవితి స్పెషల్-ఐదు నిమిషాల్లో రుచికరమైన పులిహోర ఇలా

కిచెన్ డెస్క్- పులిహోర అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరు. ఎందుకంటే రైస్ తో తయారు చేసే పులిహోర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక పులిహోరను చాలా రకాలుగా తయారు చేస్తారు. నిమ్మకాయ లేదంటే చింతపండుతో ఎక్కువగా పులిహోర చేస్తుంటారు. సరైన పద్దతిలో చేస్తే పులిహోర చాలా రుచికరంగా తయారవుతుంది. మరి టెస్టీ పులిహోరను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా..

ముందుగా నిమ్మకాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు.. అరకిలో బియ్యం, ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం, తగినంత ఉప్పు, తగినంత నూనె, అర టీస్పూన్ తురిమిని అల్లం ముక్కలు, అర టీస్పూన్ పసుపు, అర టేబుల్‌స్పూన్ పచ్చి శనగ పప్పు, అర టేబుల్‌ స్పూన్ మినపపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, తగినన్ని పల్లీలు, రెండు ఎండు మిర్చి, కరివేపాకు.

Lemon Rice 2

ఇప్పుడు పులిహోరను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.. అర కిలో బియ్యాన్ని ఉడికించి కాస్త పలుకుగా వండుకోవాలి. ఆ తరువాత ఒక వంట పాత్రలో తగినంత మంచి నూనె పోసి వేడి చేసుకుని, పల్లీలు, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, ఎండు మిర్చీ, కరివేపాకు వేసి వేయించాలి.

ఆఖరున పసుపు వేసుకోవాలి. ఆ తరువాత ఇందులో ముందుగా వండిపెట్టుకున్న అన్నాన్ని కలుపుకోవాలి. అందులో తగినంత నిమ్మరసం, ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకేముంది రుచికరమైన లెమన్ రైస్ అదేనండీ పులిహోర రెడీ. ఏంటీ నోరూరుతోందా.. వెంటనే పైన చెప్పిన విధంగా పులిహోర చేసుకుని లాగించేయండి మరి.