కరోనా పుట్టింది అక్కడేనా.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు

china

ఇంటర్నేషనల్ డెస్క్- గత యేడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా పుట్టింది చైనాలోనే అనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది.  చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టిందని అగ్ర రాజ్యం అమెరికా నుంచి మొదలు ప్రపంచ దేశాలన్నీ అనుమానిస్తున్నాయి. ఇందుకు అనుగునంగానే చైనాలో 2019 నవంబర్‌లో మొట్ట మొదటి కరోనా కేసు నమోదు కావడమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వుహాన్ ల్యాబ్‌లో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలు తొలిసారి కరోనా బారిన పడ్డారని అంటోంది అమెరికాకు చెందిన ప్రఖ్యాత వాల్‌స్ట్రీట్ జర్నల్. అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా వాల్‌ స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని ప్రచురించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

lab

ప్రపంచంలోనే 2019 డిసెంబర్ 8న చైనాలోని వుహాన్‌లో సార్స్ కోవ్ 2 మొదటి కేసు నమోదైనట్టు అధికారిక సమాచారం. బయటి ప్రపంచంలోకి కరోనా వైరస్ వచ్చే కొన్ని రోజుల ముందు చైనాలోని వుహాన్ ల్యాబ్‌ లోని ముగ్గురు పరిశోధకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ ముగ్గురిలో జ్వరం, పొడి దగ్గు, ఆయాసం వంటి ఫ్లూ లక్షణాలు కనిపించాయట. వెంటనే వీరిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆ అంశాన్ని చైనా చాలా జాగ్రత్తగా డీల్ చేసింది. విషయాన్ని ఏ మాత్రం బయటకు తెలియనివ్వలేదు. వుహాన్ లోని ల్యాబ్ తో పాటు, ముగ్గరు పరిశోధకులు ఉన్న ఆస్పత్రి చుట్టూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఐతే డిసెంబర్ నాటికి కరోనా బాహ్య ప్రపంచంలోకి వచ్చేసింది.

దీంతో కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ లో సృష్టించబడింది అనే అనుమానాన్ని బలపరుస్తున్నాయని అమెరికన్‌ ఇంటెలిజెన్స్ విభాగం తన నివేదికలో స్పష్టం చేసింది. ఐతే వాల్‌ స్ట్రీట్ జర్నల్ కధనాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. కరోనా పుట్టుక విషయంలో అమెరికా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోందని మండిపడింది. కరోనా తమ భూభాగంలో పుట్టలేదని, మేరీల్యాండ్‌లోని ఫోర్ట్‌ డెట్రిక్‌ మిలిటరీ బేస్‌ మీదే తమకు అనుమానాలు ఉన్నాయని చైనా పేర్కొంది. తమ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ లీక్ కాలేదని చైనా మరోసారి నమ్మబలుకుతోంది.