పేదల సొంతింటి కల సాకారం, తెలంగాణలో మరో అద్భుత పధకం

హైదరాబాద్- తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పధకాలను అమలు చేస్తోంది. అందులో డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందనుకున్న సమయంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల పధకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెలంగాణలో చాలా మంది పేదల సొంతింటి కల నెరవేరింది.

సొంత ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం, పేదల కోసం మరో సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్న సర్కార్, సొంత స్థలం ఉన్న పేదలు ప్రభుత్వ సాయంతో ఇళ్లు నిర్మించుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. సంక్షేమంపై శాసనసభలో శుక్రవారం జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడిన తరువాత వారి ప్రశ్నలకు, సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.

Double bed room 1

త్వరలోనే ఈ కొత్త పధకాన్ని ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, నిర్దేశించిన అర్హతలను పాటించి ఒక్కో నియోజకవర్గంలో 1,000 నుంచి 1,500 మందికి లబ్ధి చేకూరేలా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ కొత్త పథకం తెచ్చినా, మీ జేబుల్లో నుంచి ఇస్తున్నారా అని కొందరు నేతలు చులకనగా మాట్లాడుతున్నారని, వసూలు చేసిన పన్నులను ధర్మబద్ధంగా తాత్కాలిక, మధ్య, దీర్ఘకాలిక అవసరాలకు వినియోగిస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 21,663 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఈ ఏడేళ్లలో 74,165 కోట్లు వ్యయం చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పదేళ్లలో సగటున ఏడాదికి 2,166 కోట్లు ఖర్చు చేస్తే తాము 10,600 కోట్ల చొప్పున ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజకీయాల కోసం రాష్ట్రాన్ని చులకన చేసి మాట్లాడొద్దని ప్రతిపక్షాలకు కేసీఆర్ సూచించారు.