ముఖ్యమంత్రి కూతురు కవితకు 21.62 కోట్ల అప్పులు

Kavitha Trs telangana

నిజామాబాద్- తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు కావడంతో చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 120 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్పారు. ఇక నామినేషన్ల సందర్బంగా అభ్యర్ధులు సమర్పించే అఫిడవిట్లలో వారి ఆస్తులు గురించే కాకుండా అప్పుల గురించి కూడా వివరాలు పొందుపరిచారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత మరోసారి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 1:45 గంటలకు మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి సమర్పించారు కవిత. ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.

MLC Kavitha 1

నామినేషన్ దాఖలు సందర్భంగా తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్న చర, స్థిరాస్తులు, అప్పుల వివరాలను కవిత అఫిడవిట్‌ లో పొందుపరిచారు. తన పేరు మీద 14.78 కోట్లు, భర్త పేరిట 14 కోట్ల చరాస్తులు ఉన్నట్వు పేర్కొన్నారు. ఇక ఇద్దరు పిల్లల పేర్లపై 8.90 లక్షల చరాస్తులున్నట్లు కవిత అఫిడవిట్‌ లో తెలిపారు. ఆమె పేరుపై 9.30 కోట్లు, భర్త పేరిట 9.39 కోట్ల స్థిరాస్తులు కూడా ఉన్నట్లు అఫిడవిట్ లో స్పష్టం చేశారు.

అంతే కాదు కవిత, ఆమె భర్త పేరిట 21.62 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై రెండు కేసులు నమోదైనట్లు కవిత అఫిడవిట్ లో తెలిపారు. అన్నట్లు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 10న జరగనుండగా, డిసెంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఇండిపెండెంట్ అభ్యర్దుల నామినేషన్లను విత్ డ్రా చేయించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.