తిరుపతి క్రైం- చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే సామాన్యులతో పాటు పోలీసులకు సైతం వెన్నులో వణుకు పుడుతుంది. అవును మరి చెడ్డీ గ్యాంగ్ దోపిడీలు అంత భయంకరంగా ఉంటాయి. బీహార్ కు చెందిన ఈ గ్యాంగ్ కేవలం చెడ్డీలు, బనీన్ లు మాత్రమే ధరించి దొంగతనాలు చేస్తుంటాయి. అందుకే ఈ గ్యాంగ్ కు చెడ్డీ గ్యాంగ్ అని పేరు వచ్చింది. ఖరీదైన ఇళ్లలో మాటు వేసి మరీ దోపిడీలు చేయడం చెఢ్డీ గ్యాంగ్ ప్రత్యేకత.
నగర శివారుల్లోని ప్రాంతాలను ఎంచుకుని రెండు మూడు రోజులు రెక్కీ నిర్వహిస్తారు. ఎవరు లేని ఇళ్లను ఎంచుకుంటారు. అర్ధరాత్రి పూట దొంగతనానికి ముహూర్తం నిర్ణయించుకుంటారు. ఎంతటి పటిష్టమైన తాళాన్నైనా, తలపులనైనా క్షణాల్లో పగులగొట్టేస్తుంది చెడ్డీ గ్యాంగ్. ఇంట్లో ఎవరు లేకపోతే ఈజీగా తమ పని కానిచ్చేస్తారు. పొరపాటున ఎవరైనా ఉంటే వాళ్లను చావగొట్టి కట్టేసి మరీ దోపిడి చేస్తారు.
చెఢ్డీ గ్యాంగ్ కు ఎదురు తిరిగితే మాత్రం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. తమతో తెచ్చుకున్న ఇనుప రాడ్డులతో దాడులకు దిగుతారు. పోలీసులకు చిక్కకుండా చాలా చాకచక్యంగా దొపిడీలకు పాల్పడుతుంది చెడ్డీ గ్యాంగ్. గతంలో హైదరాబాద్ ప్రాంతంలో అరాచకాలు సృష్టించిన చెడ్డీ గ్యాంగ్, ఇప్పుడు హఠాత్తుగా తిరుపతిలో సంచరిస్తోంది.
తిరుపతిలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డ చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. మొత్తం నలుగురు సభ్యులతో కూడిన చెడ్డీ గ్యాంగ్ నగరంలోని విద్యానగర్ లో దోపిడికి ప్రయత్నించింది. వాచ్ మన్ రూమ్, మెట్ల మార్గం, మొదటి అంతస్తులో అమర్చిన సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ లో దోపిడీకి ప్రయత్నించారు. కానీ అక్కడ వాళ్లకు ఏమీ దొరక్కపోవడంతో మెల్లిగా వెళ్లిపోయారు.
చెడ్డీ గ్యాంగ్ కదలికలతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చెడ్డిగ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. చెడ్డీ గ్యాంగ్ తిరుపతిలోకి ప్రవేసించిందన్న వార్తలతో నగరవాసులతో పాటు పోలీసులు సైతం ఆందోళన పడుతున్నారు.