పక్కనే అమ్మ, సోదరుడి శవాలు! రెండు రోజులుగా అన్నం లేదు!

దేశంలో ఎక్కడ పట్టినా కరోనాకి సంబంధించిన కష్టాలే. ఎవరిని కదిలించినా ఇవే బాధలు. ఈ భయంతోనే ఒకరితో ఒకరికి సంబంధాలు కూడా లేకుండా పోతున్నాయి. సంఘజీవి అయిన మనిషికి ఇది కష్టమే అయినా.., ఈ కష్ట కాలంలో ఇది తప్పదు. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో సాటి మనిషి తోడు లేక కొన్ని విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా బెంగుళూరులో జరిగింది.
తన తల్లి, తమ్ముడు చనిపొరని తెలుసుకోలేని స్థితిలో ఒక మహిళ రెండు రోజుల పాటు ఆ శవాల మధ్యే గడిపింది.ఆకలితో అలమటిస్తూ అమ్మని, తమ్ముడిని లేపుతూ ఒక్కటే నరకం అనుభవించింది. ఈ వివరాల్లోకి వెళ్తే.., రాజేశ్వరి నగర్లో అర్యాంబ అనే ఆవిడకి ఓ కుమారుడు, ఓ కుమార్తె. వీరిలో హరీష్(45) ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన సోదరి శ్రీలక్షి(47) మాత్రం మతి స్థిమితం లేని వ్యక్తి. కొన్ని రోజులుగా వీరు ఇంట్లో నుండి బయటకి రావడం లేదు. కరోనా నేపథ్యంలో ఇరుగు పొరుగు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ.., వీరి ఇంటి నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ రెండు వేరు వేరు గదుల్లో రెండు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండగా గుర్తించారు. వీరిని అర్యాంబ (65), హరీష్(45)గా గుర్తించారు. ఇక మరో మహిళ శ్రీలక్షి(47) ప్రాణాలతో ఉంది. ఈమెకి మతి స్థిమితం లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ రెండు రోజులుగా శవాల మధ్య గడిపిందని పోలీసులు తెలియచేశారు. మృతదేహాలను విక్టోరియా ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మరోవైపు మతి స్థిమితం లేని శ్రీలక్ష్మి చెప్పిన మాటలు పోలీసులకు సైతం కంట నీరు తెప్పించాయి. అమ్మ నిద్రపోతోంది. లేచి అన్నం వండి పెడుతుందని చూస్తున్నా.. రోజూ అమ్మే వంట చేస్తుంది. రెండు రోజులుగా ఏమీ తినలేదని శ్రీలక్ష్మి పోలీసులకు తెలిపింది. రెండు రోజుల క్రితం అమ్మ కిందపడిపోతే.. హరీష్ చాలాసార్లు అంబులెన్స్కు ఫోన్ చేశాడని, అయినా ఎవరూ రాలేదని తెలిపింది. ఆ తరువాత అతను కూడా పడిపోయాడని శ్రీలక్ష్మి వెల్లడించింది. దీనితో పోలీసులు హరీశ్ కాల్ రికార్డ్ చెక్ చేయగా.., అతను నిజంగానే 108 కి ఫోన్ చేసినట్టు రుజువైంది. గత నెల ఏప్రిల్ 22న హరీష్ కి కరోనా నిర్ధారణ అయింది. దీంతో వీరు కరోనా కారణంగా ఆక్సిజన్ అందక చనిపోయారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.