సోషల్ మీడియా కొంత మంది వరంగా మారితే, మరికొంత మందికి శాపంగా తయారైంది. నిరుద్యోగంలో కూరుకుపోయిన కొంత మంది మహిళలకు ఇదే సోషల్ మీడియా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఒక్కరూ కాదూ మొత్తం 13 మంది మహిళలు మాయగాడి మాటలు నమ్మారు. సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకుని ఉద్యోగాలను ఇప్పిస్తామని వీరిని ముగ్గులో దించిన కేటుగాడు.. వారి జీవితాలను నరకప్రాయం చేశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసేవాడు. వీడి టార్చర్ ను తట్టుకోలేక ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన దిలీప్ ప్రసాద్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. అతడికి అమ్మాయిలంటే మోజు. దీంతో ఐటి ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నఅమ్మాయిలను టార్గెట్ చేశాడు. వారితో ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. దాని కోసం మోనికా, మేనేజర్ అని పేర్లతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ఉద్యోగాలిస్తానంటూ నమ్మబలికేవాడు. అనంతరం హోటల్ రూమ్స్ బుక్ చేసేవాడు. అక్కడకు వచ్చిన యువతులతో ఉద్యోగం గురించి వివరిస్తూ.. వారిని లోబర్చుకునేవాడు. రహస్యంగా ఆ దృశ్యాలను వీడియోలు తీసి.. తిరిగి వాళ్లను బ్లాక్ మెయిల్ చేసేవాడు. అలా 13 మంది అమ్మాయిలపై అఘాయిత్యం చేశాడు.
అతడి ఆగడాలను భరించలేని ఓ యువతి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రసాద్ భాగోతం బయటపడింది. దీంతో అతడిని అరెస్టు చేయగా.. మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. తాను డబ్బు కోసం ఈ పని చేయలేదని, కాలేజీ రోజుల నుండే అమ్మాయిలంటే మోజు అని, అప్పటి నుండే యువతులను ట్రాప్ చేసినట్లు విచారణలో నిజాలను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఉద్యోగాల పేరిట వల వేసి యువతులను లోబర్చుకున్నాడని చెప్పారు. నిందితుడిపై ఐపిసిలోని 376 సెక్షన్ తో పాటు ఐటి చట్టం 2000లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నానమని తెలిపారు.