పోలీస్ స్టేషన్ లో సీమంతం.. నెటిజన్లు ఫిదా

సాధారణంగా పోలీసులు అనగా కర్కశహృదయులు.. నేరం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తుంటారు.. వారి వద్దకు ఏదైనా ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటేనే కొంతమంది భయపడి పోతుంటారు. ఏదైనా సమస్య వచ్చినా స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయమని అంటే ఎందుకు లే పోలీసులు.. రిస్కు ఏ భాదో మేమే పడతాం అని అనేవారు ఉన్నారు. ఇక వెండితెర, బుల్లితెరపై పోలీస్ క్యారెక్టర్ ని నెగిటీవ్ గా చూపిస్తున్న విషయం కొత్తగా చెప్పనక్కలేదు.

పోలీసు అంటే భయపెట్టేవాడు కాదు.. బాధ్యత కలవారు.. మనం సమాజంలో ప్రశాంతంగా నిద్రిస్తున్నామంటే.. శాంతి భద్రతలతో ఉంటున్నాం అంటే పోలీస్ రక్షణ అన్న విషయాన్ని మర్చి పోవొద్దు. ఎలాంటి క్లిష్టతర కేసులు అయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాటిని ఛేదిస్తూ.. నేరస్తులను కటకటాల వెనక్కి నెట్టేది పోలీసులే. ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసులు గా మారుతున్న విషయం తెలిసిందే. పోలీసులపై ప్రజలకు ఉన్న ప్రతికూల భావన ఓ పెద్ద సవాలు. కరోనా మొదలైన కొత్తలో పోలీసులు చేసిన సాయంతో అది కాస్త మారింది. ఈ దిశగా ప్రభుత్వాలు కూడా ప్రజలకు – పోలీసులకు మద్య స్నేహ సంబంధాలు కొనసాగేలా చూడాలని కోరుతున్నాయి.

ఇక ఏపిలో అయితే దిశ చట్టాన్ని తీసుకు వచ్చి ఆడవారికి రక్షణగా ఉంటూ.. మహిళలకు ఏ చిన్న కష్టమొచ్చినా క్షణాల్లో అక్కడికి చేరుకొని నేరస్థుల ఆట కట్టిస్తున్నారు. అయితే పోలీసుల మనసు కఠినం.. కర్కశత్వం అని భావించే వారికి తాజాగా గుంటూరు జిల్లా గురజాల పోలీస్ స్టేషన్ జరిగిన అరుదైన సన్నివేశం చూస్తే మనసు చలించి పోతుంది. అక్కడ పోలీస్‌స్టేషన్‌లో మమతానురాగాలు వెల్లివిరిశాయి. గర్భిణి అయిన తమ గురజాల పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ కు సీమంతం నిర్వహించి పండంటి బిడ్డ పుట్టాలని దీవించారు. సహోద్యోగులు, సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు.

సాధారణంగా పోలీస్‌ స్టేషన్లో పెళ్లిళ్లను జరిపించే వార్తలు మనకి కొత్తేమీ కాదు. కానీ ఒక మహిళా కాన్‌స్టేబుల్‌కి, స్టేషన్లో సీమంతం జరిపించిన విషయం ఇప్పుడు వార్తలలో నిలుస్తోంది. పళ్లు, గాజులు, కొత్తచీరలు అన్నింటినీ ఆ మహిళా కానిస్టేబుల్ కి బహుకరించి.. ఘనంగా సీమంతాన్ని జరిపించారు. ఎప్పుడూ డ్యూటీలో ఉండే పోలీసులకి సంప్రదాయాలను పాటించే అవకాశం చిక్కదనీ, అందుకే తాము ఈ వేడకుని నిర్వహించామని సీఐ సురేంద్ర బాబు అన్నారు. పోలీసులు డ్యూటీలోనే కఠినమని, వ్యక్తిత్వంలో కాదని నిరూపించిన గురజాల సీఐ సురేంద్ర బాబు.. పోలీస్ సిబ్బందికి నెటిజన్లు హ్యాట్సాప్ చెబుతున్నారు.