60 ఏళ్ల వయసులో తన ప్రియురాలి కోసం ఎవరూ ఊహించని సాహసం చేశాడు ఓ వృద్ధుడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రియురాలిని తీసుకుని ఇంటి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు ఈ ప్రేమ జంట. ఆఖరికి పోలీస్ స్టేషన్‌నే వివాహ వేదికగా చేసుకుని.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ వివరాలు..
ప్రేమ గుడ్డిది అంటారు. దానికి ఆస్తి అంతస్తు, ఆఖరికి వయసుతో కూడా సంబంధం లేదు అంటారు. అనడం ఏంటి ఈ కోవకు చెందిన సంఘటనలు ఇప్పటికే అనేకం చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘాటు ప్రేమ కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆమెకు వివాహం అయ్యి, ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటి 28 ఏళ్ల మహిళ.. 60 ఏళ్ల వ్యక్తిని లవ్ చేసింది. ఎంత గాఢంగా ప్రేమించింది అంటే.. లవ్ చేసిన వ్యక్తి కోసం భర్త, బిడ్డలను కాదనుకుని మరీ వెళ్లింది. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అధికారుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
ఉత్తర్‌ప్రదేశ్.. భదోహి జిల్లాలోని బీహరోజ్‌పుర్‌కు చెందిన రామ్ యాదవ్(60), దాదాపు తన వయసులో సగం వయసు ఉన్న అషర్ఫీ దేవి(28)ని ప్రేమించాడు. అయితే ఆమెకు గతంలోనే అనగా.. 2008లోనే కృష్ణ మూరత్ యాదవ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణ మూరత్.. కుటుంబ పోషణ కోసం తమిళనాడులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న అషర్పీ దేవికి, రామ్ యాదవ్‌కు మధ్య పరిచయం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారడం వంటివి చకచకా జరిగిపోయాయి. అయితే భర్త వస్తే.. తమ బంధానికి అడ్డు అని భావించిన అషర్పీ దేవి.. రామ్ యాదవ్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
కొన్నాళ్ల తర్వాత అషర్పీ దేవి భర్త కృష్ణ మూరత్ తమిళనాడు నుంచి తన ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇంట్లో అతడికి తన భార్య కనిపించలేదు. దీని గురించి తన తల్లిదండ్రులను అడిగితే.. ఆమె అప్పటికే.. రామ్ యాదవ్‌తో పారిపోయింది అని చెప్పారు. దాంతో కృష్ణ మూరత్.. తన భార్య కనిపించడం లేదని.. కోయిరౌనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణ మూరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలించి రామ్ యాదవ్, అషర్ఫీ దేవిని పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. రామ్ యాదవ్, అషర్ఫీ దేవి కుటుంబ సభ్యులను కూడా స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. ఇరు కుటుంబాల మధ్య గొడవ లేకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు.
అయితే అషర్పీ దేవిన తన భర్త కృష్ణతో వెళ్లేందుకు అంగీకరించలేదు. తన ప్రియుడు రామ్ యాదవ్‌నే వివాహం చేసుకుంటానని పోలీసుల ఎదుటే తేల్చి చెప్పింది. మరోవైపు రామ్ యాదవ్ కుమారుడు, కోడలు, మనమడు, మనమరాలు వచ్చి అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ రామ్ యాదవ్ వారి మాటలు వినలేదు. అషర్ఫీ దేవినే వివాహం చేసుకుంటానని.. ఆమె అంటే తనకు ఇష్టమని చెప్పాడు. వీరిద్దరు ఇలా మొండి పట్టు పట్టడంతో చేసేదేం లేక.. ఇరువురి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్‌నే తమ వివాహానికి వేదికగా చేసుకున్నారు రామ్ యాదవ్, అషర్ఫీ దేవి. కోయిరౌనా పోలీస్ స్టేషన్లో ఉన్న గుడిలో వివాహం చేసుకున్నారు.