పెద్దల సమక్షంలో.. వేద మంత్రాల సాక్షిగా.. మూడుముళ్లు.. ఏడడుగులు వేసి.. వివాహ బంధంతో ఒక్కటైన తోడునీడగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోతే ఆ భార్య తట్టుకోలేకపోయింది.. చావులో కూడా భర్తతో బంధాన్ని వీడలేదు. కట్టుకున్న వాడు చనిపోయాడన్న వార్త విని తట్టుకోలేని ఆమె గుండె ఆగిపోయింది. కన్నీరు పెట్టిస్తున్న ఈ విషాద సంఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.
మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బల్లికురవ మండలం చిన అంబడిపూడికి చెందిన చినపాపారావు (61), భార్య రమాదేవి (57)కి కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె సునీత ఉన్నారు. కుమార్తెను అదే గ్రామంలోని మేనల్లుడు రమేష్‌బాబుకు ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగ రిత్యా చెన్నైలో ఉంటున్నాడు. గత కొంత కాలంగా పాపారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. కూతురు వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తనకు ఒంట్లో బాగాలేదని పాపారావు చెప్పడంతో అతనిని వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలోనే వేకువజామున 3 గంటల సమయంలో చనిపోయాడు.
పాపారావు చనిపోయిన విషయం ఉదయం 5 గంటల సమయంలో ఇంటి దగ్గర ఉన్న అతని భార్య రమాదేవికి చెప్పారు. ఆ వార్త విన్న రమాదేవి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చిలకలూరిపేట లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. రెండు గంటల వ్యవధిలోనే భార్య,భర్త ఇద్దరు రూచనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను చినఅంబడిపూడి తీసుకొచ్చి గ్రామంలో అత్యక్రియలు నిర్వహించారు. మరణంలోనూ భార్యభర్తల బంధాన్ని వీడలేదని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు పెట్టుకున్నారు.