వైసీపీ పార్టీ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి బుధవారం నాడు కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో కర్నూల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను విభేదించి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రమణారెడ్డి రాయలసీమ విమోచన సమితిని ఏర్పాటు చేశారు.
సీమ హక్కుల కోసం పోరాడారు. 1983లో ఎంవీ రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాయలసీమ విమోచన సమితి ఏర్పాటు చేసి సీమ ఉద్యమంలోకి వచ్చారు. గుంటూరు లో ఆయన మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఎంవీ రమణారెడ్డి ఒకరు. గుంటూరులో ఎంబీబీఎస్ చదివే రోజుల్లోనే ఆయన కవిత అనే మాసపత్రికను ప్రారంభించారు.
ఆ తర్వాత ప్రభంజనం అనే పక్షపత్రికను కూడా ఆయన నడిపారు. రాయలసీమ సమస్యలతో పాటు అనేక రచనలు, అనువాదాలు చేశారు. ఎంవీ రమణారెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.