బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న అనంతరం బెంగళూరు మీదుగా అనంతపురం జిల్లా చేరుకున్నారు. కొత్తచెరువు వద్ద భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన అభ్యర్థిని బరిలో నిలపడంలేదని వెల్లడించారు. అకాల మరణం చెందిన వైసీపీ ఎమ్మెల్యే భార్యకే వైసీపీ టికెట్ ఇచ్చినందున తాము ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
తాము మొదటి నుంచి ఆడవారికి గౌరవం ఇస్తున్న విషయం తెలిసిందే.. అందుకే ఈ స్టాండ్ తీసుకున్నట్లు తెలిపారు పవన్. ఇక బద్వేల్ ఉప ఎన్నికను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయమై బద్వేలు జనసేన నేతలతో చర్చించామని తెలిపారు. అంతకు ముందు ఆయన వైసీపీ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాలకుల వద్ద డబ్బు ఉందని, కానీ వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. జనసేనకు అధికారం ఇస్తే రాయలసీమలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాయలసీమలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిస్తామని స్పష్టం చేశారు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ కష్టాల్లో తోడుంటాను అని పేర్కొన్నారు. వైసీపీ మంత్రులు, నేతలతో గొడవలు వద్దని.. ధైర్యాన్ని గుండెల్లో దాచుకొని రాయలసీమ నేతలు పోరాటాలు చేయాలన్నారు. మీ అందరి కోసం కుటుంబాన్ని వదిలి వచ్చానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. వంద మంది బాంబులతో వస్తే తాను ఎదురొడ్డి నిలబడతానని, పోరాటస్ఫూర్తిని కొనసాగిస్తాన్నారు.