టీడీపీకి ఎదురు దెబ్బ.. చేజారిన కాకినాడ మేయర్‌ పీఠం!

గత ఇరవై రోజులుగా వ్యూహప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్‌ మార్పు ఘట్టానికి మంగళవారం తెర పడింది. కాకినాడ నగర మేయర్‌ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. కాకినాడ మేయర్‌ సుంకర పావని, డిప్యూటీ మేయర్‌ సత్తితబాబుపై అవిశ్వాసం తీర్మానం ప్రారంభమైంది. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి జేసీ లక్ష్మీశ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

megayrఈ నేపథ్యంలో కాకినాడ మేయర్ పదవిని సుంకర పావని కోల్పోయారు. రెబెల్ కార్పోరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 36 మంది కార్పోరేటర్లు ఓటు చేశారు. పావనికి అనుకూలంగా ఎవరూ కూడ ఓటు చేయలేదు. కాగా, మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు చేతులెత్తలేదు. ఇక ఎక్స్‌ అఫిషియో ఓటర్లుగా మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంపీ వంగా గీత ఓటువేశారు. అయితే పార్టీ విప్ జారీ చేసినా కూడా టీడీపీలోకి రెబెల్ కార్పోరేటర్లు పావనికి వ్యతిరేకంగా ఓటు చేశారు.

fassrtఇదిలా ఉంటే.. నియంతృత్వ ధోరణితో నగర మేయర్‌ సుంకర పావని టీడీపీని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆ పార్టీకి చెందిన అసమ్మతి కార్పొరేటర్లు మండిపడ్డారు. నాలుగేళ్లుగా మేయర్‌ పావని, ఆమె భర్త తిరుమలకుమార్‌ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల పార్టీ ఎంతో నష్టపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడులకు టీడీపీ అనుకూల, అసమ్మతి కార్పొరేటర్లు సోమవారం వేర్వేరుగా లేఖ పంపారు. ఏది ఏమైనా అసలే కష్టకాలంలో ఉన్న టీడీపీకి కాకినాడలో పెద్ద దెబ్ద తగిలిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.