సాయి ధరమ్ కోలుకోవాలని.. మోకాళ్లపై ద్వారకా తిరుమల మెట్లెక్కిన అభిమానులు

మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ కి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

gagsari minప్రమాదం జరిగిన వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. తర్వాత అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తేజ్‏కు అంతర్గతంగా గాయాలు కాలేదని.. ప్రస్తుతం చికిత్సకు సహకరిస్తున్నారని తెలిపారు. కాగా, హీరో సాయి ధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకోవాలని విజయవాడలో ప్రార్థనలు నిర్వహించారు. వాంబే కాలనీలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవ సంస్థలోని వృద్ధులు. గతంలో ఈ సేవా సంస్థకు వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌.. వృద్ధుల ఆశ్రమాన్ని నిర్మించి.. వారి బాగోగుల కోసం భారీగా విరాళం అందజేశాడు.. అందుకే ఆ బిడ్డ క్షేమంగా ఉండాలని ఉపవాసం చేస్తూ..ప్రార్థనలు నిర్వహించామని అన్నారు.

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో సాయితేజ్ అభిమానులు మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. సాయి ధరమ్ తేజ్ మంచి వ్యక్తి అని.. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లడని.. ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప మనసున్న మారాజని అభిమానులు అన్నారు.  మెగాహీరో ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని ప్రార్థించారు. సాయిధరమ్ తేజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మరోవైపు విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలోనూ, రాజమండ్రిలోని సూర్యభగవానుడి ఆలయంలోనూ అభిమానులు పూజలు చేశారు.