ఏపీ సీఎం జగన్ తో ముగిసిన చిరంజీవి భేటీ!

ఏపీలో సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న టికెట్స్ రేట్ల పోరు త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడంతో సమస్య పక్కదారి పట్టినట్టే కనిపించింది. కానీ.., ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకుని మెగాస్టార్ చిరంజీవిని మీటింగ్ కి ఆహ్వానించడం.., చిరు మర్యాద పూర్వకంగా వెళ్లి సీఎం జగన్ కి కలవడం చకచక జరిగిపోయాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ మీటింగ్ తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలోనే మీటింగ్ తరువాత.. మెగాస్టార్ చిరంజీవి మీడియాతో ముచ్చటించారు.

chirea min“ఇండస్ట్రీకి పరిశ్రమకి మధ్య గ్యాప్ పెరగకూడదు అన్న సహృదయంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను సమావేశానికి ఆహ్వానించారు. ఆ మేరకు సీఎంని కలవడం జరిగింది. సినీ పరిశ్రమ అంటే బయటకి కనిపించే అంత హంగులు ఉండవు. ఇక్కడ రెక్కాడితే గాని డొక్కాడని పేదలు ఉన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను. పేదవారిపై టికెట్స్ భారం పడకూడదు అన్న ప్రభుత్వ నిర్ణయం సరైనదే. కానీ.., ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బ తినకూడదు. ఈ విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. సీఎం జగన్ అన్నీ విషయాల మీద చాలా పాజిటివ్ గా స్పందించారు. తాను ఏ ఒక్కరి తరువున ఉండనని.., అందరికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. మరో.. వారం, పది రోజుల్లో అందరికి ఆమోదకరమైన జీవో రావచ్చు. ఈ విషయంలో అన్నీ వివరాలతో మరోసారి సీఎంని కలుస్తాను. నన్ను సొంత మనిషిలా చూస్తున్న జగన్ గారికి కృతజ్ఞతలు” అంటూ.. మెగాస్టార్ తెలియజేశారు. ఏదేమైనా ఇన్ని రోజులు అనవసర రచ్చతో పక్కదారి పట్టిన టికెట్స్ రేట్ల వ్యవహారం.. ఓ మంచి మలుపు తీసుకోవడం శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.